- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.496.86 కోట్లు
వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల కోసం రూ.496.86 కోట్ల (జీఎస్టీతో కలిపి) అంచనా వ్యయానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.

- టెండర్లు పిలిచిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
- ఆదిలాబాద్, పెద్దపల్లి విమానాశ్రయాలపైనా కేంద్రం స్పష్టత
- రాజ్యసభలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి మోహోల్ సమాధానం
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల కోసం రూ.496.86 కోట్ల (జీఎస్టీతో కలిపి) అంచనా వ్యయానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. రాజ్యసభలో సోమవారం కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి అడిగిన అన్‌స్టార్డ్ ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించిన రన్‌వే, ఆప్రాన్, టాక్సీవే తదితర పేవ్‌మెంట్ పనులతో పాటు బౌండరీ వాల్ (రక్షణ గోడ) నిర్మాణానికి ఏఏఐ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిందని మంత్రి వెల్లడించారు. అయితే ఈ విమానాశ్రయ పనులు పూర్తి కావడం, విమాన సర్వీసులు ప్రారంభం కావడం అనేది భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతులు, నిధుల లభ్యత, స్థానిక భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆదిలాబాద్, పెద్దపల్లిపైనా స్పష్టత..
తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేసేందుకు సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని (టీఈఎఫ్ఎస్) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిందని చెప్పారు. ఇందుకు అవసరమైన భూమి వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామన్నారు. అలాగే పెద్దపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు కేంద్రం పేర్కొంది.
భద్రాద్రి కొత్తగూడెంకు బ్రేక్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని రామవరం, చుంచుపల్లి, సుజాతనగర్ గ్రామాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం 2025 జనవరిలో ఏఏఐ ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం చేపట్టిందని మంత్రి తెలిపారు. అయితే అక్కడ కొండలు, రైల్వే లైన్ ఉండటం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి ఆ స్థలం అనుకూలంగా లేదని తేలిందన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ-2008 కింద భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సైట్ క్లియరెన్స్ ప్రతిపాదనలు రాలేదని వివరించారు. తెలంగాణలో ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు ఉడాన్ పథకం కింద ఇప్పటికే 58 రూట్లను అందుబాటులోకి తెచ్చామని కేంద్ర మంత్రి మోహోల్ తెలిపారు. ఉడాన్ తదుపరి దశను 2026 జులై 4న ప్రారంభించామని, ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ సహా మరో 120 కొత్త ప్రాంతాలను అనుసంధానించడమే కాకుండా, 4 కోట్ల మంది ప్రయాణికులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.






