మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం

by Kodari Anjali |   (  Updated:2026-07-20 16:33:00  IST  )

జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై జిల్లా పోలీసులు ఆదివారం భారీ స్థాయిలో ప్రత్యేక దాడులు నిర్వహించారు.

మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం
X

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి: జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై జిల్లా పోలీసులు సోమవారం భారీ స్థాయిలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ రుణగ్రహీతల నుంచి షూరిటీ పేరుతో ఖాళీ చెక్కులు, భూముల అసలు పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను ఆర్థికంగా వేధిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 90 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, 10 మంది నిందితులపై 10 కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.59 కోట్ల విలువైన 266 ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం (సీజ్) చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారం, అనుమతి లేని చిట్టీల నిర్వహణ, ప్రజలను బెదిరించి ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలు తీసుకోవడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని, ఇలాంటి వ్యవహారాల్లో పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎన్. తిరుపతి రావు హెచ్చరించారు. అక్రమ వడ్డీ వ్యాపారులు లేదా లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకుల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story