వాళ్లిద్దరిపై చర్యలేవి: రేవంత్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్న

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-03 09:27:51  IST  )

ఫార్ములా ఈ రేస్ స్కాం చర్యలేవని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ..

వాళ్లిద్దరిపై చర్యలేవి: రేవంత్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ రేస్ స్కాం పేరుతో ప్రతిసారి ట్విట్టర్ టిల్లును విచారణకు పిలిచి డ్రామాలాడుతున్నారే తప్ప చర్యలేవని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ కేసులో తప్పు జరిగిందని, అవినీతి జరిగిందని తమరే చాలా సార్లు చెప్పారు కదా? అని ఆయన గుర్తు చేశారు. మరి కేటీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ స్కాంలో విదేశీ సంస్థ పాత్ర ఉంది కదా? అని, మరి ఈ కేసును సీబీఐ విచారణ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసుపైనా బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్ లా రెండేండ్ల నుంచి ఎందుకు డ్రామాలాడుతున్నట్లు? అని సంజయ్ ప్రశ్నించారు. ‘‘పెద్దాయన కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చారు కదా?. తండ్రీ కొడుకు కలిసి వేల కుటుంబాల జీవితాలను నాశనం చేశారు కదా?. మరి వాళ్లపై చర్యలేవి?. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు, విదేశీ సంస్థలు ఇమిడి ఉన్నాయి కదా?. కేంద్ర పెద్దలు, జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తమరే చెప్పారు కదా?, మరి ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు?. విదేశాల నుంచి రాకపోతే ప్రభాకర్ రావు ఆస్తులు జప్తు చేస్తామని కోర్టులో వాదించిన ప్రభుత్వం ప్రభాకర్ రావు వచ్చాక ఎందుకు వదిలేసినట్లు?.’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

‘‘ఇన్ని స్కాంలు జరిగితే విచారణ చేయకుండా, కాళేశ్వరం అంశాన్ని దారి మళ్లించడానికి కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు బీఆర్ఎస్‌తో కుమ్కక్కై కవిత అంశాన్ని తెరమీదకు తెచ్చి పార్టీ అంతర్గత అంశంపై చర్చ జరిగేలా చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఇవా? వాళ్ల సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ స్కాంలపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపకుండా కవిత పేరుతో డ్రామాలాడుతున్నారు. ఈ డ్రామాలతోనే స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తున్నాయి.’’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.

Next Story