భారత్- పాక్ సరిహద్దుల్లో బండి సంజయ్ పర్యటన.. పంజాబ్ ముంపు బాధితులకు ఇచ్చిన భరోసా

by Ramesh Naini |

వరదల ప్రభావంతో పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాకు జరిగిన నష్టాన్ని ప్రధాని మోడీకి నివేదించబోతున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ​కుమార్​ తెలిపారు.

భారత్- పాక్ సరిహద్దుల్లో బండి సంజయ్ పర్యటన.. పంజాబ్ ముంపు బాధితులకు ఇచ్చిన భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరదల ప్రభావంతో (Punjab flood victims) పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాకు జరిగిన నష్టాన్ని ప్రధాని మోడీకి నివేదించబోతున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ​కుమార్​ (Union Minister Bandi Sanjay) తెలిపారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడం బాధాకరమని, పంజాబ్ ప్రజలు అధైర్య పడొద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారి ఆదేశాల మేరకు ఆ భరోసా ఇచ్చేందుకే తాను పంజాబ్ కు వచ్చినట్లు వివరించారు. వరద దెబ్బకు సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనిక సైన్యం పత్తా లేకుండా పోయిందని, సరిహద్దు ముంపు బాధితులకు నిరంతరంగా అండగా ఉన్న బీఎస్ఎఫ్ సైనికుల ధైర్య, సాహసాలు, సేవలు మరువలేమన్నారు. శనివారం ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా (India-Pakistan border) భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు.

పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,097 గ్రామాలు వరద ముంపుకు గురికాగా, 3,88,092 మంది ప్రజలు వరదలతో నష్టపోయి 56 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వానలు, వరదలను లెక్క చేయకుండా నిరంతరం గస్తీ కాయడమే కాకుండా బాధితులను రక్షిస్తూ వారికి అన్ని విధాలా అండగా ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు. గురుచుర్, సమురయ్, ఘనియక్ బేట్, రన్ సేక్ తల్లాన్ గ్రామాల ప్రజలతో మాట్లాడి వరద బాధితులకు నెలకు సరిపడా బియ్యం, పప్పు, మసాలా దినుసులతో కూడిన మోడీ కిట్ల’ను అందజేశారు. వరద ముంపు బాధితులు తీవ్రమైన కష్టాల్లో ఉన్న విషయాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దన్నారు.

నష్టపోయిన పంజాబ్ రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల తక్షణ సాయం విడుదల చేసినట్లు తెలిపారు. ఇవిగాకుండా రూ.1200 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు సైతం రాష్ట్రం వద్దే ఉన్నాయని గుర్తు చేశారు. వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్తి, పంట, ఇతరత్రా నష్టాలపైనా పూర్తి నివేదిక వచ్చాక ప్రజలకు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Next Story