అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలు అమలు కాలే.. పెండింగ్‌లో ఉన్న బడ్జెట్ ఎంతో తెలుసా?

by Disha Web Desk 2 |
అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలు అమలు కాలే.. పెండింగ్‌లో ఉన్న బడ్జెట్ ఎంతో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2022-23 బడ్జెట్ పెట్టి పది నెలలు దాటిపోయింది. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పలు పథకాలు అమలుకు నోచుకోలేదు. కాగితాలకే పరిమితమయ్యాయి. 'బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు.. ప్రజల ఆశల, ఆకాంక్షల వ్యక్తీకరణ' అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గతేడాది మార్చి 7న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 'నేడు తెలంగాణ ఆచరిస్తున్నది రేపు దేశం అనుసరిస్తున్నది' అని కూడా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటలు అక్కడికే పరిమితమయ్యాయి. దళితబంధు పథకాన్ని దేశమంతా అమలుచేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.17,700 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. కానీ ఒక్క పైసా విడుదల చేయలేదు. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించినా.. ఇంతవకు దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయలేదు. సుమారు లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీతో మోటారు సైకిళ్లను అందజేస్తామన్నారు. దానికి కూడా కాగితాలకే పరిమితం చేశారు.

రూ.45 వేల కోట్లకు పైగానే పెండింగ్

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గతేడాది మార్చిలో రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఏయే స్కీమ్‌కు ఎంతెంత కేటాయించిన విషయాన్ని తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. మొత్తం బడ్జెట్ వ్యయంలో దాదాపు ఐదో వంతు (రూ. 45 వేల కోట్లకు పైగానే) నిధులు విడుదల కాకపోవడంతో స్కీమ్‌లలో కదలిక లేదు. అంతకుముందు నిరుద్యోగ భృతి అని ప్రకటించినా ఇప్పుటికీ దాని ఊసే ఎత్తడం లేదు. ఈ స్కీమ్ తరహాలోనే ప్రస్తుత బడ్జెట్‌లోనూ చాలా పథకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా శాఖలకు సంబంధించిన స్కీమ్‌ల వివరాలను, రానున్న ఆర్థిక సంవత్సరంలో అవసరమైన నిధుల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ తీసుకున్నది. వచ్చే ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నది. ఈ రెండు నెలల వ్యవధిలో పెండింగ్ నిధులు విడుదల కావడం అనుమానమేనని సచివాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బడ్జెట్ సైజు భారీగానే ఉన్నా, ప్రజలకు ఆశలు కల్పించినా చివరకు అవి అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.

కొత్త బడ్జెట్‌లో ఇంకా ఎలాంటి హామీలు ఉంటాయోననే చర్చ ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఒకటో, రెండో కొత్త స్కీమ్‌లను ప్రభుత్వం ప్రకటిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉన్నదనే విమర్శ సరేసరి. కేంద్రం నుంచి గ్రాంట్లు రాకపోవడం, రిజర్వు బ్యాంకు ద్వారా పొందాల్సిన స్టేట్ డెవలప్‌మెంట్ లోన్‌లకు ఎఫ్ఆర్‌బీఎం పేరుతో ఆటంకాలు ఏర్పడడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం తదితర కారణాలతో చాలా పథకాలకు నిధులు రిలీజ్ కాలేదు. పాత బిల్లులకు ఫైనాన్స్ డిపార్టుమెంట్ నుంచి టోకెన్లు జారీ అయినా చెల్లింపులు జరగలేదు. ఆర్బీఐ ద్వారా రూ.52,167 కోట్ల రుణాన్ని తీసుకోవాలనుకున్నా అది రూ.36,750 కోట్లకు మాత్రమే పరిమితైంది. సుమారు రూ.16వేల కోట్లు కోత పడింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.41,001 కోట్లు వస్తాయని అంచనా వేసుకున్నా నవంబరు చివరి నాటికి రూ.6 వేల కోట్లకు మాత్రమే సర్దుబాటయింది. సుమారు రూ.35 వేల కోట్ల మేరకు కోత పడింది. ఈ రెండు ఖాతాల్లోనే దాదాపు రూ.71 వేల కోట్లు అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల నడుమ బడ్జెట్‌లో ప్రకటించిన హామీల అమలుకు అవసరమైన నిధులను రిలీజ్ చేయడంలో చిక్కులు ఎదురయ్యాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలకు మాత్రమే క్రమం తప్పకుండా ప్రభుత్వం నిధులను విడుదల చేసి అమలు చేస్తున్నది.

బడ్జెట్‌లో ప్రకటించినా ఇప్పటివరకు నిధుల విడుదలకాని పథకాలు కొన్ని..

దళితబంధు : బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1500 మందికి తలా రూ.10 లక్షల చొప్పున మొత్తం 118 సెగ్మెంట్లలో ఇవ్వాలని కేటాయింపులు చేసింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు.

రూ.3 లక్షల స్కీం : సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 4 లక్షల మందికి ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కానీ మార్గదర్శకాలు కూడా రెడీ కాలేదు.

స్కాలర్‌షిప్‌లు : విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, డైట్ చార్జీల కోసం రూ.4,688 కోట్లను కేటాయించింది. కానీ ఇప్పటికీ విద్యార్థులకు అవి అందలేదు. ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ కాలేదన్నది అధికారుల వాదన.

వ్యవసాయ విద్యుత్ : రైతులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రూ.10,500 కోట్లను కేటాయించింది. కానీ డిస్కంలకు ఆ బకాయిలు సర్కారు నుంచి విడుదల కాకపోవడంతో అవి అప్పుల్లో కూరుకుపోయినట్టు ప్రకటించి ఇప్పుడు ఏసీడీ పేరుతో గృహ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నది.

గొర్రెల పథకం : యాదవ, కుర్మ సోదరులకు ఉచితంగా గొర్రెలు, మేకల స్కీమ్‌కు సంబంధించి ఈ బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను కేటాయించినా అవి ఇప్పటికీ విడుదల కాలేదు. దీంతో పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా పెండింగ్‌లో పడింది.

ఓల్డ్ సిటీ మెట్రో : పాతబస్తీలో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. పాతబస్తీకి మెట్రో సౌకర్యానికి కనీస ప్రతిపాదనలు కూడా లేవు.

రుణమాఫీ : రైతుల రుణమాఫీ కోసం నిర్దిష్టంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోయినా రూ.75 వేల వరకు బ్యాంకుల నుంచి లోన్‌లు తీసుకున్నవారికి మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. సుమారు ఏడు లక్షల మందికి రూ.4వేల కోట్లు ఖర్చు కానున్నట్టు అంచనా. గతేడాది రూ.50 వేల లోపు రుణమాఫీ కోసం హామీ ఇచ్చినా రూ.35 వేల వరకు లోన్‌లు ఉన్నవారికే మాఫీ అయింది. దీంతో సుమారు 3 లక్షల మందికి రూ.1100 కోట్ల మేర అందలేదు. ఈ రెండూ కలిపితే దాదాపు రూ.5,100 కోట్లు అవసరమైనా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.

Also Read....

బీఆర్ఎస్‌లో మంత్రి కేటీఆర్ రోల్ ఏంటి?


Next Story

Most Viewed