ఎస్పీడీసీఎల్‌లో భర్తీ కాని జేఎల్ఎం పోస్టులు.. ఉన్న వారిపై పని ఒత్తిడి

by Malleboina Mahesh |

టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నెలకొన్న తీవ్ర సిబ్బంది కొరత అటు ఉద్యోగులకే కాక, ఇటు సామాన్య ప్రజలకూ ఇబ్బందిగా పరిణమించింది.

ఎస్పీడీసీఎల్‌లో భర్తీ కాని జేఎల్ఎం పోస్టులు.. ఉన్న వారిపై పని ఒత్తిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో నెలకొన్న తీవ్ర సిబ్బంది కొరత అటు ఉద్యోగులకే కాక, ఇటు సామాన్య ప్రజలకూ ఇబ్బందిగా పరిణమించింది. జంట నగరాల పరిధిలోని నాలుగు ప్రధాన సర్కిల్స్ (సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, బంజారాహిల్స్) తో పాటు స్కాడా విభాగంలో దాదాపు 70 శాతం జూనియర్ లైన్‌మెన్ (జేఎల్ఎం) పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్రస్థాయిలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణ, పర్యవేక్షణ పూర్తిగా పడకేసింది. కేవలం 30 శాతం సిబ్బందితోనే యాజమాన్యం నెట్టుకొస్తుండటం వల్ల విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ఒత్తిడితో ప్రమాదాల బారిన పడుతుండగా.. మరోవైపు వీధుల పొడవునా తెగిపడుతున్న వైర్లు, ఫాల్టీ ట్రాన్స్‌ ఫార్మర్లపై సరైన నిఘా లేక సామాన్య జనం కూడా మృత్యువాత పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది కొరతతో ఉద్యోగులపై మోయలేని పని భారం పడుతోంది. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి, క్షేత్రస్థాయిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పని ఒత్తిడి.. ప్రాణాంతక ప్రమాదాలు!

జంట నగరాల్లో కొత్త సబ్ స్టేషన్లను మంజూరు చేస్తున్న మేనేజ్మెంట్, వాటికి తగినట్లుగా సిబ్బందిని రిక్రూట్ చేయడంలో పూర్తిగా విఫలమైందని ఉద్యోగులు వాపోతున్నారు. ముఖ్యంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ విభాగంలో షిఫ్టుకు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరితోనే పనులు చేయిస్తున్నారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక, సరైన భద్రతా ప్రమాణాలు పాటించే సమయం లేక విద్యుత్ లైన్లు కట్ చేయకుండానే స్తంభాలు ఎక్కి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగాయి. గత ఐదారు నెలల్లోనే దాదాపు 10 నుంచి 15 ప్రమాదాలు జరిగాయని, పలువురు కార్మికులు శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, క్షేత్రస్థాయిలో రెగ్యులర్ పెట్రోలింగ్, పర్యవేక్షణ చేసే సిబ్బంది లేకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ తీగలు తెగిపడినా, సబ్ స్టేషన్ల నుంచి సకాలంలో స్పందన లేకపోవడంతో తండ్రి-కూతురు సహా నలుగురు సామాన్య పౌరులు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే చనిపోయారు. సకాలంలో లైన్లను పర్యవేక్షించే సిబ్బంది ఉండి ఉంటే ఈ ఘోర ప్రమాదాలను నివారించే వీలుండేదని స్థానికులు చెప్తున్నారు.

జీవోనే కారణమా?

గత ప్రభుత్వం తీసుకొచ్చిన 95% లోకల్, 5% నాన్-లోకల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ (జీవో) కారణంగానే జంట నగరాల్లో జేఎల్ఎం ఖాళీలు భర్తీ కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఐటీఐ పాసై పోల్ ఎక్కేందుకు వచ్చే అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం, ఇక్కడి స్థానికులు ఐటీఐ చేసినా లైన్ మెన్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఇతర జిల్లాల నుండి వచ్చి హైదరాబాద్‌లో ఐటీఐ చదివినప్పటికీ, వారి ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఉన్న బోనఫైడ్ ఆధారంగా నాన్-లోకల్ కిందికే వస్తుండటంతో ఇక్కడి పోస్టులు ఖాళీగానే ఉండిపోతున్నాయి. గత మూడేళ్లుగా రిక్రూట్మెంట్లు జరుగుతున్నా 70% ఖాళీలు అలాగే మిగిలిపోవడానికి ఈ నిబంధనలే కారణమని తెలుస్తోంది. మరోవైపు 61 ఏళ్ల వయోపరిమితి కారణంగా ఈ రెండేళ్లలో భారీగా ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో సమస్య మరింత జటిలమవుతోంది.

ఉద్యోగ సంఘాల ప్రత్యామ్నాయ ప్రతిపాదన

ఈ సంక్షోభ నివారణకు ఉద్యోగ సంఘాలు మేనేజ్మెంట్‌కు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నాయి. జిల్లాల (రూరల్) నుండి హైదరాబాద్‌కు బదిలీపై రావాలనుకునే ఆసక్తి గల ఉద్యోగులను ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేయాలని, తద్వారా జిల్లాలో ఏర్పడే ఖాళీలను అక్కడ అందుబాటులో ఉన్న స్థానిక ఐటీఐ అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరుతున్నారు. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నిబంధనల ఉల్లంఘన జరుగుతుందనే భయంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోలేక పోతోందని తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా 50% లోకల్, 50% ఓపెన్ కోటా పద్ధతిలోనైనా ఖాళీలను భర్తీ చేసి ఉద్యోగుల ప్రాణాలను కాపాడాలని, పని ఒత్తిడిని తగ్గించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని, విద్యుత్ సంస్థ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

విద్యుత్ ప్రమాదాలు ఇలా..

- గతేడాది ఆగస్టు 15న (కృష్ణాష్టమి) రాత్రి రామంతాపూర్‌లోని గోఖుల్‌నగర్‌లో శ్రీకృష్ణుని రథోత్సవం కార్యక్రమంలో విద్యుత్‌ షాక్‌ తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ తర్వాత 4 రోజుల వ్యవధిలోనే చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్‌తో ధోని (21), వికాస్‌ (20) మరణించారు. 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని చంద్రాయణగుట్ట నుంచి పురానాపుల్‌కు తీసుకొని వెళ్తుండగా కరెంట్ వైర్లు తగిలాయి. వాటిని కర్రతో పక్కకు లేపుతున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

- అల్వాల్ లో గత జూన్ 13న శనివారం తెల్లవారుజామున ఈదురు గాలుల వల్ల ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి, అక్కడ పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఆ కొమ్మతో పాటు ఒక లైవ్ విద్యుత్ వైరు కూడా కారుపై పడి ఉంది. తెల్లవారుజామున వర్షం తగ్గిన తర్వాత, సందీప్ (45), ఆయన కుమార్తె రితికా (16) కారుపై ఉన్న చెట్టు కొమ్మలను తొలగించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యుత్ వైరు తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే కరెంట్ షాక్‌కు గురై మరణించారు.

ఓల్డ్ సిటీలోని బండ్లగూడలో జూన్ 9న సాయంత్రం భారీ వర్షం పడుతున్న సమయంలో ఈదురు గాలులకు విద్యుత్ వైరు తెగి, నీరు నిలిచిన రోడ్డుపై పడింది. ఆ సమయంలో ఒక హోటల్ వద్ద ఆటో దిగిన అఫ్రోజ్ (30), జాఫర్ (15) అనే ఇద్దరు రోడ్డుపై నిలిచిన నీటిలో అడుగుపెట్టారు. నీటిలో విద్యుత్ ప్రవహిస్తుండటంతో ఇద్దరికీ తీవ్రమైన షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు.

-మైలార్ దేవ్ పల్లి విద్యుత్ సెక్షన్ లో ఏ.సతీష్ కుమార్ (42) లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న విధి నిర్వహణలో భాగంగా సెక్షన్ పరిధిలోని పల్లె చెరువు సమీపంలో ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరఫరాలో పనులు చేపడుతుండగా అకస్మాత్తుగా సరఫరా రావటంతో విద్యుత్ షాక్ గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

-నగరంలోని కుమ్మర్వాడి హనుమాన్ ఆలయం సమీపంలో ఈ ఏడాది మే19న అసిస్టెంట్ లైన్ మెన్ రాజు నాయక్ ఒక విద్యుత్ స్తంభానికి మరమ్మతు పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న హై-టెన్షన్ తీగను తాకాడు. ఆ షాక్‌కు అతను స్తంభం పైనుంచి కిందపడిపోయి, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అతని నాడి కూడా పడిపోయిందని వెంటనే తపచబుత్ర పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.

Next Story