HYD: ఎమ్మెల్యేల ఆటలు.. బొక్కబోర్లాపడ్డ ఆది శ్రీనివాస్ (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-28 15:13:40  IST  )

రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఈరోజు తమలోని క్రీడాకారుడిని బయటకు తీశారు.

HYD: ఎమ్మెల్యేల ఆటలు.. బొక్కబోర్లాపడ్డ ఆది శ్రీనివాస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఈరోజు తమలోని క్రీడాకారుడిని బయటకు తీశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా 'తెలంగాణ శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్-2026' తొలి ఎడిషన్ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల ఒత్తిడిని పక్కన పెట్టి, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడల ప్రారంభోత్సవం అనంతరం మొదటగా టగ్ ఆఫ్ వార్ (తాడు లాగే ఆట) నిర్వహించారు. రెండు జట్లుగా విడిపోయిన ఎమ్మెల్యేలు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి తాడును లాగారు. ఈ క్రమంలో ఒక పక్క ఎమ్మెల్యేలు బలంగా లాగడంతో పట్టు తప్పి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్లకిలా కిందపడిపోయారు.

తొలి ఎడిషన్ ప్రత్యేకం..

మైదానంలో జరిగిన ఈ అనూహ్య పరిణామంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురైనప్పటికీ, ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పక్కనే ఉన్న ఇతర ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి కిందపడ్డ వారిని పైకి లేపారు. కిందపడినా సరే చిరునవ్వుతో లేచిన ఎమ్మెల్యేలు, తిరిగి ఉత్సాహంగా ఆటను కొనసాగించడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ శాసనసభ చరిత్రలో ప్రజాప్రతినిధుల కోసం ఇలాంటి స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ పోటీల్లో క్రికెట్, ఫుట్‌బాల్‌తో పాటు పలు గ్రామీణ క్రీడలను కూడా చేర్చారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కే అసెంబ్లీ వాతావరణం నుండి ఉపశమనం పొందడానికి, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత పెంచడానికి ఈ క్రీడలు దోహదపడతాయని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రీడా వేడుకను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో ఎల్బీ స్టేడియం కోలాహలంగా మారింది. వీడియో

నిమ్స్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు

Next Story