- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ
హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.4,051 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో ఎంఎస్ నం.43 జారీ చేశారు. నగరంలోని మెట్రో జోన్‌లో ఓవర్ హెడ్ లైన్లను పూర్తిగా తొలగించి అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
టీజీఎస్‌పీడీసీఎల్ సమర్పించిన డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత బంజారాహిల్స్ సర్కిల్, సికింద్రాబాద్ సర్కిల్, హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సర్కిళ్లలోని 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లను అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ గా మార్చే పనులకు ప్రభుత్వం అంగీకరించింది. నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించడం, అనుకోని విద్యుత్ కోతలు లేకుండా చూడటం, నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య రంగాలకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం లక్ష్యాలుగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను రూపొందిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టు వ్యయం కోసం నిధుల సమీకరణను టీజీ ఎస్పీడీసీఎల్ అంతర్గత నిధులతో లేదా రుణాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అదేవిధంగా టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టీ-ఫైబర్ వంటి సంస్థలను అండర్‌గ్రౌండ్ కేబులింగ్‌లో భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రాజెక్టు అమలు కోసం టీజీఎస్పీడీసీఎల్ వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ ప్రాజెక్టు పూర్తికావడం ద్వారా మెట్రో జోన్‌లో విద్యుత్ వ్యవస్థ మరింత విశ్వసనీయంగా మారి, నగరాభివృద్ధికి కొత్త ఊపు రానున్నట్లు అధికారులు భావిస్తున్నారు.






