- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను ఎండగడుతూ, మరోవైపు రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇంటింటికి సీపీఐ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అటు పాదయాత్రలు, ఇటు బస్సు యాత్రల ద్వారా రెండు దశల్లో కార్యక్రమాన్ని రూపొందించింది. ఆదివారం మగ్ధూం భవన్‌లో కూనంనేని మీడియాతో సమావేశంలో వెల్లడించారు.
బీజేపీ అనుసరిస్తున్న ప్రమాదకర నిర్ణయాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘బీజేపీ కో హటావో దేశ్ కో బచావో’ పేరుతో అంబేద్కర్ జయంతి రోజున ప్రజల్లోకి వెళ్లాలని సీపీఐ జాతీయ సమితి పిలుపునిచ్చిందని కూనంనేని తెలిపారు. దీంతో పాటు, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం 14వ తేదీ నుంచి ‘ఇంటింటికి సీపీఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సీపీఐ ముఖ్య నేతలు కె . నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, తాను రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు.
ఇందులో భాగంగా నెల రోజుల పాటు రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పాదయాత్రలు, మోటార్ సైకిల్ యాత్రలు ద్వారా ప్రతి ఇంటి తలుపు తట్టి బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై ప్రజలను జాగృతం చేస్తామన్నారు. అలాగే నివేశన స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, దళిత బంధు, పెన్షన్ సంబంధించి పోరాటాలను ఉధృతం చేసేందుకు ప్రత్యక్షంగా ప్రజల నుంచి వివరాలను తెలుసుకుంటామని చెప్పారు.
‘ఇంటింటికి సీపీఐ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, వాటికి సిపిఐ జాతీయ నేతలు హాజరవుతారని చెప్పారు. అనంతరం జూన్ నెలలో రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రాజకీయ నినాదంతో రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు సంకల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముగింపుగా హైదరాబాద్ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. విభజన హామీల అమలును డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన బయ్యారం నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కూనంనేని వెల్లడించారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్ జిల్లాలో సాగే ఈ ప్రజా పోరు పాదయాత్ర ఏప్రిల్ 25న హన్మకొండలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు.
కవితపై బండి వ్యాఖ్యలకు గవర్నర్ ఎందుకు స్పందించ లేదు..?
ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎందుకు స్పందించలేదని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. గతంలో షర్మిల కూర్చున్న కారును పోలీసులు లాక్కెళినప్పుడు ఒక మహిళగా స్పందించిన గవర్నర్, కవిత విషయంలో ఎందుకు స్పందించ లేదన్నారు. ఈ వ్యవహారంలో కనీసం మేయర్ వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతించరా? అని నిలదీశారు. బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆయనపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, బాల నర్సింహా, తక్కెళ్లపల్లి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.






