- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యథేచ్ఛగా కల్తీ నూనెల వ్యాపారం.. అయోమయంలో ప్రజల పరిస్థితి!
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోపాటు కల్తీ సరకుల విక్రయాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

దిశ, కామారెడ్డి: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోపాటు కల్తీ సరకుల విక్రయాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా జరుగుతోంది. వీటి వల్ల మోసపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతీ మనిషి ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు తినే ఆహారంలో ఎక్కువగా వినియోగించేది వంట నూనెలను మాత్రమే. అలాంటి వంట నూనెలను కొంతమంది మాఫియాగా ఏర్పడి కల్తీ చేస్తూ దానిని యథేచ్ఛగా ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ వ్యాపారం అంతా కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంగా సాగుతూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నూనెలను సరఫరా చేస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అయితే వీరి వ్యాపారానికి ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంగా కల్తీ వంట నూనెల తయారీ జోరుగా సాగుతుంది. వివిధ బ్రాండ్ల నూనెలను సైతం కల్తీ చేస్తూ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వంట నూనెలను కల్తీ చేస్తూ వాటికి వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో కూడిన లేబుళ్లను అతికిస్తూ జోరుగా వ్యాపారం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు యదేచ్చగా సరఫరా చేస్తున్నారు. అయినా ఈ దందా గురించి ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఈ వ్యాపారం గురించి తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనేది బహిరంగ రహస్యం.
కల్తీ నూనెలతో అనారోగ్యాల పాలు :
కల్తీ వంట నూనెలను తినడంతో ప్రజలు వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ విషయం వైద్యులు ప్రజలకు చెబుతున్నప్పటికీ అమాయక ప్రజలకు ఒరిజినల్ నూనెలు దొరకడమే గగనం అయిపోయింది. కల్తీ నూనెలకు వివిధ రకాల బ్రాండ్ల లేబుళ్లను అతికించి ప్రజలకు విక్రయిస్తుండడంతో ఏది అసలు, ఏది నకిలీయో తెలియక వాటిని కొనుగోలు చేస్తూ ప్రజలు తిని అనారోగ్యాలకు గురవుతున్నారు.
వచ్చేది ఎడిబుల్ ఆయిల్... తయారయ్యేది రిఫైండ్ వంట నూనెలు :
కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల ఓ వంట నూనెల తయారీ పరిశ్రమకు వచ్చేది ఎడిబుల్ ఆయిల్ ట్యాంకర్లు. ఈ ఎడిబుల్ ఆయిల్ ను ఈ పరిశ్రమలో దిగుమతి చేసుకొని దానిలో వివిధ రకాల కెమికల్స్ వాడుతూ దానిని కల్తీ చేస్తూ సన్ఫ్లవర్, పల్లి, రైస్ బ్రాన్ వంట నూనెలు అంటూ తయారు చేస్తున్నారు. వీటిని వివిధ రకాల బ్రాండ్ల పేర్ల స్టిక్కర్లను అతికిస్తూ యదేచ్చగా రావాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల తనిఖీలు ఎక్కడ :
ప్రజలు తినే ఆహారాన్ని కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కల్తీ మాఫియా కు అడ్డుకట్ట వేసే వారే లేకుండా పోయారు.
బ్రాండెడ్ ఆయిల్‌లో ఆంధ్రా, తెలంగాణ పేరిట విక్రయాలు :
ఓ పేరుమోసిన బ్రాండ్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ పేరిట కల్తీ నూనెలు తయారు చేసి ప్రజలకు అనుమానం రాకుండా ఆంధ్ర, తెలంగాణ పేరిట యదేచ్చగా విక్రయిస్తున్నారు. తెలంగాణ ఒక కలర్ నూనె తెలంగాణలో తయారవుతుందని, మరో రకం స్టిక్కర్ గలది ఆంధ్ర కాకినాడలో తయారవుతుందని, ఏది తీసుకున్నా ఒకటే రేటు... నూనెలో మాత్రం క్వాలిటీ అదే అని చెబుతూ ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.
కల్తీ నూనెల వ్యాపారం తమ దృష్టికి రాలేదు: ఫుడ్ ఇన్స్పెక్టర్, శిరీష
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్తీ నూనెల వ్యాపారం సాగుతుందనే విషయం తమ దృష్టికి రాలేదు. ఇక్కడ తయారవుతున్న కల్తీ వంట నూనెలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్నట్లు తెలియదు. కామారెడ్డిలో అసలు నూనెల తయారీ పరిశ్రమ ఉన్నట్లుగా తన దృష్టికే రాలేదు. ఈ విషయమై పరిశీలన చేస్తా.






