- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ-జనసేన పొత్తుపై సందిగ్ధత.. బరిలో ఇరు పార్టీల అభ్యర్థులు
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి, జనసేనకు మధ్య పొత్తుపై సందిగ్ధత నెలకొన్నది. ఇది తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి, జనసేనకు మధ్య పొత్తుపై సందిగ్ధత నెలకొన్నది. ఇది తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో బలమైన బంధమున్న ఈ రెండు పార్టీలు ఏపీలోనూ మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందని ఇరు పార్టీల కీలక నేతలు ప్రకటించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. వందలాది వార్డుల్లో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సరైన సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు. అనేక వార్డుల్లో రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్లు చీలిపోయి ఫలితాలపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ముందుగానే పొత్తు ఖరారు చేసుకొని, సీట్ల పంపకాల్లో సమన్వయం చేసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు.
మరోవైపు చాలా వార్డుల్లో రెండు పార్టీలకూ అభ్యర్థులు కరువైనట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా మైనార్టీలు అధికంగా ఉండే భైంసా, బోధన్, జహీరాబాద్, వికారాబాద్ లాంటి అనేక మున్సిపాలిటీల్లోని వార్డుల్లో రెండు పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలో నిలపలేకపోయాయి. కాగా, ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతికి చెందిన వారు ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్నారు.
నాయకత్వ వైఫల్యమేనా?
ఏదో ఊహించుకొని ముందుకు వెళ్తున్న బీజేపీకి కనీసం వార్డుల్లో అభ్యర్థులను పోటీ పెట్టలేని పరిస్థితి ఉండడం నాయకత్వ వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయావకాశాలను పక్కన పెడితే.. కనీసం పోటీ చేసే స్థాయిలో కూడా వారికి కార్యకర్తలు కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన నాయకులకు గల్లీల్లో ఎవరు నాయకులుగా ఉన్నారో తెలియకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని విమర్శిస్తున్నారు.






