MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలపై అనిశ్చితి.. మరోవైపు పోటీకి సై అంటున్న నాయకులు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలపై అనిశ్చితి.. మరోవైపు పోటీకి సై అంటున్న నాయకులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతుండగా ఇతర రాజకీయ నేతలు మాత్రం మరో ఎన్నిక ఎప్పుడంటూ చర్చ మొదలుపెట్టారు. గ్రామాల్లోని నాయకులు ఇదే అంశంపై వాడీవేడిగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, ఓ పని అయిపోతుందంటూ అభిప్రాయాలు, ఆలోచనలను వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్దమవుతున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అదే టైంలో టిక్కెట్టు సాధించడానికి వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ నెలాఖరున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని సోషల్​మీడియాలో జరిగిన ప్రచారంతో ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, సీఎం రేవంత్ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్‌లపై అసెంబ్లీలో చర్చించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవా? అంటూ గ్రామాల్లో చర్చ మొదలైంది. ఈనెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తు్న్నది.

ఎన్నికలపై ఆచితూచి..

పంచాయతీరాజ్​శాఖ అధికారులు ఇప్పటికే ఎంపీటీసీల విభజనను పూర్తిచేశారు. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటరు జాబితాను, పోలింగ్​కేంద్రాల జాబితాను సిద్ధం చేసింది. కానీ, వీటి కంటే ముందు ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. సర్పంచ్​ఎన్నికలు ముగియడంతో గ్రామీణ ప్రాంత నాయకులందరూ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రజల ఓట్ల ద్వారా జరుగుతాయి. అదే సమయంలో పార్టీ పరంగా, పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు అయినందున ఎవరికెన్ని ఓట్లు, సీట్లు వచ్చాయని ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీరి ఎన్నిక తరువాత పరోక్ష ఎన్నిక విధానంలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ల ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. అందుకే ఈ ఎన్నికలపై ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం, అధికార కాంగ్రెస్​భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మున్సిపోల్స్ ముందు జరిగేనా?

మరోవైపు ముందుగా మున్సిపల్​ఎన్నికలు నిర్వహిస్తారని బలమైన ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు రూ.700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి చివర్లో పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్​ఆఫీసర్ల పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలకవర్గం, వచ్చే మే నెలతో వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్​లాంటి పాలకవర్గాల గడువు ముగియనుంది. దీంతో వీటన్నంటిని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారా? లేక గతంలో లాగానే విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. మున్సిపల్​ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ఎన్నికల సంఘం ఇంతవరకు ప్రారంభించలేదు.

డెడికేషన్ నివేదికకు ఆమోదం తెలిపాకే..

మున్సిపల్ అధికారులు ఎక్కడైతే వార్డుల విభజన అవసరం ఉందో వాటిని కొన్ని నెలల క్రితమే పూర్తి చేశారు. సమీప గ్రామాలు మున్సిపాలిటీలో కలవడం, కొన్ని గ్రామాలు విడిపోవడం, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు తదితర ప్రక్రియ నేపథ్యంలో వాటన్నంటినీ సీడీఏంఏ అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాలను గుర్తించాల్సి ఉంది. వీటి ప్రక్రియకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఓటరు జాబితాను తయారు చేయడం కనీసం 10 రోజులు, ముసాయిదా తయారు చేయడం, దానిపై అభ్యంతరాలు, ఆల్ పార్టీ మీటింగ్‌లు నిర్వహించడం, తరువాత తుది జాబితా ప్రకటించడం చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించాల్సి ఉంది. వార్డు ఓటరు సంఖ్యకు అనుగుణంగా పోలింగ్​కేంద్రాలను తయారు చేయాలి. వీటికి కూడా వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందని, రెండు ఒకేసారి చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో ఎన్నికల సంఘం ఇప్పటికప్పుడు వీటి ప్రక్రియను ప్రారంభించినా సంక్రాంతి వరకు ఈ ప్రక్రియ సాగుతుందని అంచనా వేస్తున్నారు. మున్సి‘పోల్స్’​ను ప్రభుత్వం నిర్వహించాలనుకుంటే అంతకుముందు డెడికేటెడ్​ కమిషన్ నివేదికను తెప్పించుకుని దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఆ తర్వాతే జిల్లాల్లో రిజర్వేషన్‌లు ఖరారు చేసి గెజిట్​విడుదల చేస్తారు. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్​విడుదల చేసే అవకాశం ఉంది.

Next Story