మున్సిపల్ శాఖలో అనిశ్చితి..! కుదిపేస్తున్న షాకింగ్ బదిలీలు

by Kema Shiva Kumar |

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులకు అచ్చిరావడం లేదా..?

మున్సిపల్ శాఖలో అనిశ్చితి..! కుదిపేస్తున్న షాకింగ్ బదిలీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులకు అచ్చిరావడం లేదా..? అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లే ఇచ్చి ఒక్కసారి బదిలీ చేస్తున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో మొదటి సారి మున్సిపల్ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన దాన కిషోర్ ఆ తరువాత ఇంకా పూర్తి స్థాయి అవగాహన వచ్చే సందర్భంలోనే అర్ధాంతరంగా బదిలీ అయ్యారు. తాజాగా కోర్​ మున్సిపల్ ఏరియా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇలంబర్తి ఇదేవిధంగా బదిలీ అయ్యారు. ఆయన నాలుగు నెలల్లోనే ట్రాన్స్‌ఫర్ అయ్యారు. దీంతో మున్సి పల్ శాఖ కీలక హోదా వారికి అచ్చి రావడం లేదని, అర్ధాంతరంగా బదిలీ అవుతున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. వీరి విషయాలు స్వయంగా శాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం రావడంతో వారిపై బదిలీ వేటు వేసి ప్రధాన్యం లేని శాఖ బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం. సీఎం దగ్గర శాఖ ఉండటంతో అన్ని కార్యకలాపాలను కార్యదర్శులే చూసుకోవాల్సి రావడంతో ఇదే అదునుగా భావించి చెప్పిన దాని కన్నా అదనంగా పనులు చేశారనే విమర్శలూ లేకపోలేదు.

గతంలో దానకిషోర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖను సీఎం తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్, జల మండలి ఎండీగా సేవలందించిన అనుభవం ఉన్న దానకిషోర్‌ను ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఏడాదిన్నర పాటు కొనసాగారు. అయితే సీఎం చెప్పినదాని కంటే అత్యుత్సాహంతో వ్యవహరించారనే ఆరోపణలతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేసిందని ప్రచారం జరిగింది.

నేడు ఇలంబర్తి

రవాణ శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఇలంబర్తిని జీహెచ్ఎంసీగా ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీలో పని చేసిన నాలుగు నెలల్లోనే పరిపాలన, ఆర్థిక పరమైన అంశాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితాలు ఇచ్చాయి. మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌గా విభజించిన ప్రభుత్వం మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా ఇలంబర్తిని నియమించింది. సీఎం, కేబినెట్ ఆదేశాలు బేఖాతర్ చేయడంతో పాటు ఆర్థిక పరమైన ఆరోపణల కారణంగా శాఖను మార్చారని ప్రచారం జరుగుతోంది.

Next Story