డీఆర్‌పీ పీజీ ట్రైనీల అనధికార బదిలీలు రద్దు..

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-13 02:18:12  IST  )

జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్ (డీఆర్పీ)లో భాగంగా వైద్య విద్యార్థుల అనధికారిక బదిలీలపై అకడమిక్ డీఎంఈ తీవ్రంగా స్పందించారు. అనుమతి లేకుండా జరిగిన విద్యార్థుల పున: కేటాయింపులను రద్దు చేస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

డీఆర్‌పీ పీజీ ట్రైనీల అనధికార బదిలీలు రద్దు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్ (డీఆర్పీ)లో భాగంగా వైద్య విద్యార్థుల అనధికారిక బదిలీలపై అకడమిక్ డీఎంఈ తీవ్రంగా స్పందించారు. అనుమతి లేకుండా జరిగిన విద్యార్థుల పునఃకేటాయింపులను రద్దు చేస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 2026 బ్యాచ్‌కు సంబంధించి కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, మలక్‌పేట, నాంపల్లి ఏరియా ఆసుపత్రుల్లో పోస్టింగ్ పొందిన పలువురు విద్యార్థులు, అధికారుల అనుమతి లేకుండా గోల్కొండ ఏరియా ఆసుపత్రికి బదిలీ అయినట్లుగా అకడమిక్ డీఎంఈ డా.శివిరాం ప్రసాద్ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన డీఎంఈ.. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ విభాగాలకు చెందిన అభ్యర్థులను తక్షణమే జీఎంసీ కుత్బుల్లాపూర్, జీఎంసీ మహేశ్వరం ఆసుపత్రులకు బదిలీ చేయాలని ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ప్రస్తుతం గోల్కొండ ఆసుపత్రిలో ఉన్న మిగిలిన విద్యార్థులు ఈ విడత పూర్తయ్యే వరకు అక్కడే కొనసాగేందుకు అనుమతించారు. అయితే, విద్యార్థులందరూ సంబంధిత ప్రిన్సిపాల్ జారీ చేసిన పోస్టింగ్ ఉత్తర్వులను మాత్రమే కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో టీవీవీపీ లేదా జిల్లా ఆసుపత్రులకు డీఆర్పీ విద్యార్థులు అవసరమైతే, కచ్చితంగా డీఎంఈ కార్యాలయాన్ని సంప్రదించి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని టీవీవీపీ కమిషనర్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. పీజీ ట్రైనీలు ఉద్యోగులు కారని, శిక్షణలో ఉన్న విద్యార్థులని, వారిని ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్‌పై పంపడం శిక్షణకు, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులు పేర్కొన్నారు. ఈ అంశంపై వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించిన అకడమిక్ డీఎంఈకి డీఆర్‌పీ పీజీ ట్రైనీలు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story