- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో కొత్త డిగ్రీ కాలేజీల ఏర్పాటు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కనీస నిబంధనలు పాటించకుండా, ఏ ఒక్క యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు లేకుండానే నగరంలో 11 బ్రాంచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఏదైనా కొత్త కాలేజీని ఏర్పాటు చేయాలంటే గుర్తింపు పొందిన వర్సిటీ అనుబంధ గుర్తింపు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ ముందస్తు అనుమతులు, కనీసం వర్సిటీల అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) లేకుండానే కొన్ని విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఒక ప్రముఖ కాలేజీ పేరుతో హైదరాబాద్‌లోని మణికొండ, కూకట్ పల్లి, సనత్ నగర్, సంతోష్ నగర్, మియాపూర్, నారాయణగూడ, సికింద్రాబాద్, దిల్‌సుఖ్ నగర్, బోయిన్ పల్లి, హబ్సిగూడ, లింగంపల్లిలలో బ్రాంచీలను ఏర్పాటుచేయబోతున్నట్టు తెలిసింది. కాగా, ఈ కాలేజీలు కొత్తగా ఏర్పాటు అవుతున్నవి కావని, కన్వర్షన్ కింద అడ్మిషన్లు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కన్వర్షన్ చేసుకున్నా ప్రభుత్వం నుండి కన్వర్షన్ అనుమతి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన లేకుండా ఎలా అడ్మిషన్ల ప్రక్రియ, ప్రచార కార్యక్రమాలు చేపడతారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ప్రజాప్రతినిధి హస్తం..
నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఈ కాలేజీలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రజాప్రతినిధికి చెందినవిగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు డిగ్రీల కాలేజీలను తీసుకుని తమ కాలేజీ పేరుతో నడిపించుకునేందుకు రంగం సిద్దం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే హోర్డింగులు, ప్రకటనలతో భారీ ఎత్తున అడ్మిషన్ల ప్రచారం చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక కాలేజీకి యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు తప్పనిసరి అవసరం. కానీ అఫిలియేషన్ ప్రక్రియను పక్కనపెట్టి ముందస్తుగానే అడ్మిషన్లు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు అడ్మిషన్లు సైతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా, ఈ కాలేజీ దోస్త్ పరిధిలో లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.
నిబంధనలను పక్కన పెట్టి, ధనార్జనే ధ్యేయంగా, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో కాకుండా ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటూ అడ్మిషన్లు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా కొత్త డిగ్రీ కాలేజీ ప్రారంభించాలంటే ఉన్నత విద్యా మండలి అనుమతితో పాటు, స్థానిక యూనివర్సిటీ ఉస్మానియా లేదా జేఎన్టీయూ వంటి వాటి నుంచి అఫిలియేషన్ తప్పనిసరి. కానీ, ఈ కొత్త కాలేజీలకు ఇప్పటివరకు ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి కూడా గుర్తింపు లేదని తెలుస్తోంది.
సీఎంఓకు ఫిర్యాదులు
అఫిలియేషన్ లేకుండానే కాలేజీలు లాంచ్ చేయబోతున్నారన్న సమాచారంతో ఇప్పటికే ఆయా కాలేజీలపై సీఎంవోకు, ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. యూనివర్సిటీ అఫలియేషన్లు లేకుండానే కాలేజీలో అడ్మిషన్లను జోరుగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఎంఓ, ఉన్నతవిద్యామండలిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపడితే విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, కాలేజీ యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.






