- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలమూరు పంచాయతీల్లో ఏకగ్రీవాల మోత.. సీఎం సొంత ఊరుతో మొదలైన జోరు!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవాలు అయ్యాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పలు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్‌తో సహా మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక కావడం ప్రధానాంశంగా నిలిచింది. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కూడా ఆరు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవాలకు పలుచోట్ల వేలం పాటలు, ఒప్పందాలు కారణమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బండోనిపల్లి, కేశ్లీతండా పంచాయతీల్లోనూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన నారాయణపల్లి సర్పంచ్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు సన్మానించారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అనంతరం అధికారులు తుది జాబితాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏకగ్రీవాలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.
దిశ, నెట్‌వర్క్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవాలు అయ్యాయి. వేలం పాటలు, ఒప్పందాలు తదితర కారణాలతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంతోపాటు, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదయ్యాయి.
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్, 10 వార్డు సభ్యులు..
దిశ, వంగూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, 10 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు మల్లె పాలకుల వెంకటేశ్వర్లు అలియాస్ మోహన్ నామినేషన్ల సమయం ముగిసేసరికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. 10 వార్డు స్థానాలకు సైతం ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేశారు. 1వ వార్డుకు కొలుకులపల్లి జంగయ్య, 2వ వార్డుకు మారేడు పార్వతమ్మ, 3వ వార్డుకు వేమారెడ్డి, 4వ వార్డుకు కొమిరా రేణుక, 5వ వార్డుకు రాష్క దేవమ్మ, 6వ వార్డుకు ముచ్చింతల కృష్ణ, 7వ వార్డుకు కడారి చందుయాదవ్, 8వ వార్డుకు గంగాపురం అనిత, 9వ వార్డుకు ముత్యాల లక్ష్మారెడ్డి, 10వ వార్డుకు గుజ్జుల మమత దాఖలు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఆరు స్థానాలు..
దిశ, మద్దూరు/కొత్తపల్లి/ గుండుమాల్ : సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు, కొత్తపల్లి, గుండు మాల్ మండలాల్లో మొత్తం ఆరు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. మద్దూరు మండల పరిధిలోని పెద్దిరిపాడు తండా నుంచి సర్పంచ్‌గా అనసూయ, అప్పిరెడ్డిపల్లి నుంచి శ్రీనివాస్, ధమలతాండ అభ్యర్థిగా అనిత నాయక్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కొత్తపల్లి మండలంలోని నందిగామ ఎస్పీ రిజర్వుడు స్థానం నుంచి సర్పంచిగా శారద, గుండుమాల్ మండలంలోని అప్పయ్యపల్లి తండా నుంచి రవీందర్‌నాయక్, పెద్దతండా నుంచి కృష్ణానాయక్ సర్పంచ్‌లుగా ఎంపికయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఏకగ్రీవాలు...
దిశ, వెల్దండ/తెలకపల్లి/పెద్దకొత్తపల్లి : వెల్దండ మండలంలోని బండోనిపల్లి, కేశ్లీతండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బండోన్‌పల్లి సర్పంచ్ స్థానం జనరల్ మహిళా రిజర్వు కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. అదే విధంగా కేశీతండాలో రెండోసారి సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి మేఘవత్ శ్రీనివాసులు నాయక్‌తోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. తెలకపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పులిపాటి శ్రీనివాసులును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని నారాయణపల్లి గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎంపికైన భారీ బాబులు యాదవును రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. మంత్రితోపాటు మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ అభినందనలు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో...
దిశ, గట్టు : మండల పరిధిలోని మొదటి విడత ఎన్నికలు జరగనున్న రెండు గ్రామాల సర్పంచ్ పదవులు వేలం పాటల ద్వారా ఏకగ్రీవం అయ్యాయి. లింగాపురం గ్రామంలో సునంద అనే మహిళ ఏకగ్రీవం కాగా, బసపురం గ్రామంలో శ్రీరామ్ గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎంపిక ఏకగ్రీవం అయినట్లేనని సమాచారం.
గోపాల్‌పేటలో ఏకగ్రీవం...
దిశ, గోపాల్‌పేట : మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచి, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సర్పంచిగా గుర్రగాళ్ల బంగారయ్య, ఉప సర్పంచ్‌గా మండల కృష్ణమ్మ, వార్డు సభ్యులుగా గుండె లక్ష్మయ్య, అయోధ్య రాములు, గౌరీ వెంకటయ్య తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జి అధ్యక్షులారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.






