యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, వారికి అత్యంత నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో ఇవాళ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయుష్ (AYUSH) శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్‌లో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, నిర్మాణ పనులు మరియు భవిష్యత్ కార్యాచరణపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు.

జనవరి నాటికి ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పూర్తి కావాలి

హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ రాష్ట్రంలోనే యునాని వైద్య సేవలకు ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. హాస్పిటల్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేయాలని టీజీఎంఎస్‌ఐడీసీ (TGMSIDC) చీఫ్ ఇంజనీర్‌‌ను మంత్రి ఆదేశించారు. వచ్చే జనవరి నాటికి ఈ నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అదవిధంగా హాస్పిటల్‌లో డాక్టర్లు, టీచింగ్ ఫాకల్టీ, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వైద్య సేవలు, విద్యా కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. వెంటనే ఖాళీల భర్తీకి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. యునాని డిస్పెన్సరీలు, హాస్పిటల్స్‌లో అవసరమైన మందులు, పరికరాలు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రూ.52.50 కోట్లతో వారసత్వ భవనాల పునరుద్ధరణ

ఈ సమావేశంలో ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్‌ బాబు మాట్లాడుతూ.. ఆయుష్‌లో గతేడాది 138 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంతో, డాక్టర్ల కొరత తీరిందన్నారు. నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాల పునరుద్ధరణ, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.52.50 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు వివరించారు. అవసరమైన యునాని మందుల కొనుగోలు, పంపిణీ కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి యునాని డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధం చేసిన ప్రాజెక్టు ప్రతిపాదనను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మౌలాలిలోని ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ భవనానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, అక్కడ యునాని వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story