- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణ పనుల్లో జాప్యం: డీజీపీ సీరియస్
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో నిర్లక్ష్యం, ఆలస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సొసైటీ అధ్యక్షుడి హోదాలో డీజీపీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ స్కూల్‌ను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని, నిర్మాణంలో వేగంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ పిల్లలతో పాటు సాధారణ ప్రజల పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య అందించాలన్నారు. రెండో విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ పాఠశాలలో నర్సరీ నుంచి 6వ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి.
2026 27 విద్యా సంవత్సరానికి 360 మంది ప్రవేశాలు పొందగా, వీరిలో 184 మంది పోలీస్, 176 మంది నాన్ పోలీస్ కుటుంబాల పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా 17 గదులతో నిర్మించనున్న అకాడమిక్ బ్లాక్ నమూనాను డీజీపీ పరిశీలించారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడల వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరిగి, మాదకద్రవ్యాల వంటి దురలవాట్లకు దూరంగా ఉంటారని డీజీపీ అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రస్తుత విద్యా విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై ప్రిన్సిపల్ అనితా రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీపీ కీ వివరించారు. పాఠశాల పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ప్రొక్యూర్‌మెంట్, అకాడమిక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కోఆర్డినేషన్ కమిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ఈ సమావేశంలో సొసైటీ ఆమోదముద్ర వేసింది. ఈ సమీక్షలో డీజీలు మహేష్ భగవత్, డాక్టర్ అనిల్ కుమార్, సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, ఐజీ గజరావు భూపాల్, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ కుమార్, ఏఐజీ రమణ కుమార్, స్కూల్ ప్రతినిధులు దీప్తి, రాజేష్, విశాల్, సతీష్, సాక్షి తదితర సొసైటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






