మెడిసిన్ చదవాలనుకునే స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. అక్కడికి వెళ్లొద్దని NMC హెచ్చరిక!

by Gantepaka Srikanth |

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ అప్రమత్తం చేసింది. బెలిజ్, ఉజ్బెకిస్తాన్‌లోని కొన్ని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశం తీసుకోవద్దని సూచించింది.

మెడిసిన్ చదవాలనుకునే స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. అక్కడికి వెళ్లొద్దని NMC హెచ్చరిక!
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ అప్రమత్తం చేసింది. బెలిజ్, ఉజ్బెకిస్తాన్‌లోని కొన్ని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశం తీసుకోవద్దని సూచించింది. అక్కడి వైద్య విద్య ప్రమాణాలు మన దేశ స్టాండర్డ్స్ కు సరిపోవని పేర్కొంది. భారతీయ ఎంబసీల నుంచి తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని వివరించింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య బోర్డు (యూజీఎంఈబీ) వివరాలు వెల్లడించింది.

ఎన్ఎంసీ హెచ్చరించిన వర్సిటీలు ఇవే..

- సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ, బెలిజ్

- కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, బెలిజ్

- వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్, బెలిజ్

- తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఉజ్బెకిస్తాన్

సరైన ప్రమాణాలు పాటించకపోవడంతోనే..

ఈ వైద్య విద్యాసంస్థలపై మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని యురేషియా విభాగం సమాచారాన్ని సేకరించాయి. ఈ సంస్థల్లో మౌలిక సదుపాయాలులేకపోవడం, సరైన ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించాయి. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. కాలేజీ ప్రమాణాలను సరిగా లేవని గుర్తించి.. అక్కడి నుంచి వైదొలగాలనుకున్న భారతీయ విద్యార్థులను వేధిస్తున్నట్లు నిర్ధారించాయి.

గతంలోనే హెచ్చరించినా..

విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివి, భారతదేశంలో అల్లోపతిని ప్రాక్టీస్ చేయడానికి రిజిస్ట్రేషన్ కోరుకునే భారతీయ విద్యార్థులను ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్ఎంసీ హెచ్చరించింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సియేట్ (ఎఫ్ఎంజిఎల్) నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. కోర్సు వ్యవధి, బోధనా మాధ్యమం, సిలబస్, క్లినికల్ శిక్షణ, ఇంటర్న్‌ షిప్ లాంటివి పరిశీలించాకే అడ్మిషన్ తీసుకోవాలని పేర్కొంది. అయితే వీటిని లెక్కచేయకుండా కొందరు విద్యార్థులు కొన్ని కన్సెల్టెన్సీల మాటలు నమ్మి విదేశీ కళాశాలల్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ఎంసీ సూచించింది.

Next Story