- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది పంచాంగం.. ఆదివారం సుక్క, ముక్క ముట్టుకోవద్దు.. రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణం
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్దాంతి బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ (Ugadi Panchangam) శ్రవణం చదివి వినిపించారు. ఆదివారం నాడు తెలంగాణలో సుక్క.. ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతుందని సిద్దాంతి చెప్పుకొచ్చారు. అధికారులు, నాయకులు, ప్రజలు సుక్క, ముక్కలకు దూరంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఆరోగ్యం, రాష్ట్రం బాగుంటుందని, భగవంతుడు అనుగ్రహిస్తారని శాస్త్రం చెబుతోందని అన్నారు. రాజు చక్కగా పరిపాలన చేయాలంటే ఆదివారం నియమం పాలకులు, ప్రజలు పాటించాలని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కార్యక్రమంలో హాజరైన వారందరూ నవ్వారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అదేవిధంగా రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని సిద్దాంతి బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సంవత్సరం ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారని, తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదని, పంటలు అద్భుతంగా పండుతాయని అన్నారు. ఎర్ర రేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయని, శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారని సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.
తుపాన్లు, భూకంపాలు సైతం అప్పుడప్పుడు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటుందని, ప్రజలకు డబ్బు బాగానే సిద్ధిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రజలు అత్యంత సంతోషంగా ఉంటారని, రాష్ట్రానికి రావాల్సిన డబ్బు రాకపోవడంతో కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో ఇబ్బందులు వస్తాయని, వాటిని ముఖ్యమంత్రి అధిగమిస్తారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు. విద్య, వైద్యంపై ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, అనుకోని ఇబ్బందుల వల్ల అన్ని కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చని అన్నారు.
విదేశీ పెట్టుబడులు ఎక్కువగా తెచ్చే ప్రయత్నం చేస్తారని, రాష్ట్ర ఆదాయం బయటకు పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఈ ఏడాది వర్షం బాగా పడుతుందని అన్నారు. కానీ పంటలు కాపాడుకోవాలని పంచాంగ శ్రవణంలో వెల్లడించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఈ సంవత్సరం పరుగులు పెడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించిందని, పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పరుగులు పెట్టి పాలన సాగిస్తారని తెలిపారు.






