- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పిల్లి’ కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య.. హైదరాబాద్‌లో వరుస విషాదాలు
హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు నగరాన్ని కలచివేస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు నగరాన్ని కలచివేస్తున్నాయి. మూగజీవాలపై ఉన్న అమితమైన ప్రేమ ఒకరి ప్రాణం తీస్తే, తల్లిదండ్రుల మందలింపుతో కలిగిన మనస్తాపం మరొకరిని బలి తీసుకుంది. పిల్లి కారణంగా ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడటం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎంబీబీఎస్ విద్యార్థిని సూసైడ్
అల్వాల్‌కు చెందిన తుమ్మల ప్రిన్సి శ్రేష్ఠ అనే యువతి ఎంబీబీఎస్ చదువుతోంది. ఇంట్లోకి పిల్లిని తీసుకురావాలని ఆమె ఆశపడగా, తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. పిల్లుల వల్ల ఇన్‌ఫెక్షన్స్ వస్తాయని, ఆరోగ్యానికి మంచిది కాదని వారు ప్రిన్సిని మందలించారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఇదే విషయంలో తల్లిదండ్రులతో వాగ్వాదం జరిగిన తర్వాత, మనస్తాపానికి గురైన ప్రిన్సి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
మరో ఘటన మీర్‌పేట్‌లో వెలుగుచూసింది. హిమబిందు (20) అనే బీఎస్సీ విద్యార్థిని గత రెండేళ్లుగా ఒక పిల్లిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటోంది. అయితే, ఆ పిల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ప్రాణప్రదంగా చూసుకున్న పిల్లి దూరం కావడాన్ని హిమబిందు జీర్ణించుకోలేకపోయింది. తీవ్రమైన మానసిక వేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ రెండు ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణాలు తీసుకోవడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావోద్వేగాలను నియంత్రించు కోలేక, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తాయని కామెంట్స్ పెట్టారు.
గమనిక: ఆత్మహత్య అనేది దేనికీ పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా ఇబ్బందులు ఉన్నప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. (హెల్ప్ లైన్ నెంబర్:100).






