- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌పై మంత్రి తుమ్మల ఘాటు వ్యాఖ్యలు.. తెలంగాణ రైతులకు కీలక భరోసా
బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము రైతు భరోసా(Rythu Bharosa) నిధులు విడుదల చేయగానే BRS నాయకులు డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సాగులో ఉన్న భూములను గుర్తించి వాటికే రైతుభరోసా నిధులు చెల్లిస్తామని అన్నారు. సదుద్దేశంతో చేపట్టిన పథకాలను రాయకీయం చేసిన ఘనత కేవలం ప్రతిపక్ష నాయకులకే చెల్లిందని విమర్శించారు. మీరు కోతల మనుషులు, మీది కోతల ప్రభుత్వం అనే ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. పంట పండే ప్రతీ గుంటకు రైతుభరోసా చెల్లించే బాధ్యత మాది అని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 6 రోజుల్లోనే రైతు భరోసా సహాయం కోసం రూ. 7770.83 కోట్లు ఖర్చు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టికే దక్కుతుందని అన్నారు. మా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా 2 లక్షల లోపు రుణమాఫీని ఒకేసారి చేయడం, అదేవిధంగా ఇప్పుడు కేవలం 6 రోజులలోనే 7770.83 కోట్లు రైతు ఖాతాలలో జమ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపారని మంత్రి పేర్కొన్నారు.
‘‘ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2.18 లక్షల ఎకరాలలో దాదాపు 93000 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువుకాని భూములను ఇప్పటికే గుర్తించామని, వీటికి తప్ప సాగులో ఉన్న మిగతా 1.20 లక్షల ఎకరాల భూమికి రైతుభరోసా పథకాన్ని వర్తింపచేయుటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రైతులకు కూడా రానున్న 2,3 రోజులలో రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. సాగు చేసే భూములకే రైతుభరోసా అందించాలనే ఉద్దేశ్యంతోనే ORR లోపల ఉన్న భూములకు పథకాన్ని వర్తింపచేయడానికి సమయం పట్టింది. కానీ దీనిని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ఇలాంటివి చేయడం కేవలం బీఆర్ఎస్ నాయకులకే చెల్లుతుంది. కోతల ప్రభుత్వమని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు, రైతులు తిరస్కరించిన విషయం వారు మరిచినట్టున్నారు. రైతుల తరపున పేటెంట్లు తమకే ఉన్నట్టు ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, వారి హయాంలో అమలు చేసిన రుణమాఫీని గుర్తుచేసుకుంటే రైతుల ముందుకు రావడానికి కూడా మొహం చెల్లదు. రైతుబంధు నిధులను ఎన్ని నెలల పాటు విడుదల చేశారో ఒకసారి తిరిగి చూసుకొండి’’ అని మంత్రి హితవు పలికారు.
తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన మాట ప్రకారం ఎకరాలతో సంబంధం లేకుండా పండించే ప్రతి గుంటకూ రైతుభరోసా సాయాన్ని వర్తింపజేయడానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా సద్వినియోగం చేయాలన్నది తమ ప్రభుత్వ ఆలోచన అని, మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంటే ప్రతిపక్షాలు గొంతు చించుకోవడం వారి విజ్ఙతకే వదిలేస్తున్నా అని మంత్రి అన్నారు.






