- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామపంచాయతీ ఎన్నికల టైంలో ఉపాధ్యాయుల సస్పెండ్.. తక్షణమే రద్దు చేయాలి : టీఎస్ యూటీఎఫ్
సస్పెండ్ చేయబడిన ఉపాధ్యాయుల సస్పెన్షన్లు తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమయంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అకారణంగా సస్పెండ్ చేయబడిన ఉపాధ్యాయుల సస్పెన్షన్లు తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) డిమాండ్ చేసింది. మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సిబ్బందిగా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని పేర్కొంది. తక్కువ రెమ్యునరేషన్ చెల్లించినా, పోలింగ్ కేంద్రాల్లో అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ సర్దుకొని, ఎన్నికల ప్రక్రియను న్యాయంగా, క్రమబద్ధంగా నిర్వహించడంలో వారు ఎంతో కృషి చేశారని పేర్కొంది. అయితే, కొన్ని స్వల్ప సంఘటనల కారణంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అంకితభావంతో పనిచేసిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేయడాన్ని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ తీవ్రంగా ఖండించారు.
నల్గొండ జిల్లాలోని చిన్న కాపర్తి గ్రామంలో సర్పంచ్ బ్యాలెట్ పేపర్ల భద్రతకు రిటర్నింగ్ ఆఫీసర్-2 ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉన్నప్పటికీ సంబంధం లేని ప్రిసైడింగ్ ఆఫీసర్లు పదిమంది ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని చేగొమ్మ గ్రామంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన విధానాలను కచ్చితంగా అనుసరించి నప్పటికీ ఆర్వో 2 విధులు నిర్వర్తించిన సీనియర్ ప్రధానోపాధ్యాయుడిని సరైన విచారణ లేకుండానే సస్పెండ్ చేశారని, ఈ చర్యలు ఎన్నికల విజయవంతం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వేలాది మంది ఉపాధ్యాయుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఈ చర్యలు అన్యాయంగా తీసుకున్న తొందరపాటు చర్యలే అయినా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఎన్నికలు ముగిసేవరకు ఓపికగా ఉన్నామన్నారు.
ఎన్నికలు ముగిసినందున వెంటనే సస్పెన్షన్లు రద్దు చేసి ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆ మేరకు నల్గొండ, ఖమ్మం జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రాతినిధ్యం సమర్పించినట్లు టీఎస్ యూటీఎఫ్ నాయకులు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు తగిన సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారని వారు వెల్లడించారు.






