ట్రంప్, మోడీ, నెతన్యాహు ముగ్గురి సైద్దాంతిక సారూప్యత ఒక్కటే : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు అరుణ్ కుమార్

by Ramesh Naini |

అమెరికా ఫస్ట్ అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా ఇండియా ఫస్ట్ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

ట్రంప్, మోడీ, నెతన్యాహు ముగ్గురి సైద్దాంతిక సారూప్యత ఒక్కటే : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు అరుణ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికా ఫస్ట్ అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా ఇండియా ఫస్ట్ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి మోడీ సాగిల పడుతున్నారని విమర్శించారు. ట్రంప్, మోడీ, నెతన్యాహు ముగ్గురిలోనూ సైద్ధాంతిక సారూప్యత ఉందన్నారు. ఆ ముగ్గురికీ ముస్లింలపై ద్వేషం నరనరాన ఉందని చెప్పారు. భారత్ తో పాటు ఇజ్రాయెల్ లోనూ మతం ఆధారంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అమెరికాలో ట్రంప్ జాత్యాహంకారాన్ని పెంచుతున్నారని అన్నారు. ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. సీపీఎం రాష్ట్ర విస్తృత సమావేశం సోమవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఆ పార్టీ సీనియర్ కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ, మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహు మంచి పనులు చేస్తున్నారంటూ ప్రశంసించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరాన్ ఇస్లాం మత నాయకుడు ఖమేనీ సహా మరో 40 మంది చనిపోతే స్పందించని మోడీ.. యూఏఈపై ఇరాన్ దాడి చేస్తే ఖండించారని గుర్తు చేశారు. వెనిజులా అధ్యక్షుడు మధురోను అపహరిస్తే అనేక దేశాలు ఖండించినా మోడీ మాత్రం స్పందించలేదని చెప్పారు. సోషలిస్టు క్యూబాను అమెరికా దిగ్బంధనం చేసిందన్నారు. విశ్వ గురు అని చెప్తున్న మోడీ గొంతెత్తడం లేదని అన్నారు.

భారత్‌పై టారిఫ్‌ను తగ్గించని అమెరికా

అమెరికాతో భారత ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని అరుణ్ కుమార్ చెప్పారు. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ ను 18 శాతానికి తగ్గించడమే విజయంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గతంలో మూడు శాతం టారిఫ్ ఉండేదని గుర్తు చేశారు. భారత్ లో అమెరికా వస్తువుల దిగుమతిపై 30 శాతం టారిఫ్ లు ఉంటే దాన్ని సున్నా శాతానికి తగ్గించిందని వివరించారు. దీనివల్ల భారత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి, సోయాబీన్ దిగుమతి చేసుకుంటే ఆ రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే దిగుమతులు పెరగడం, సబ్సిడీలు తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉపాధి హామీ చట్టం వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని వివరించారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్వరూపాన్ని పూర్తిగా మార్చి వేసిందన్నారు. దీంతో వ్యవసాయ కార్మికులకు ఉపాధి హక్కుగా ఉండబోదని అన్నారు. కేంద్రం నిర్ణయాల వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అణుఒప్పందం చట్టంలోనూ కేంద్రం మార్పులు చేసిందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అణురియాక్టర్‌లు తయారు చేసే వారిని కాకుండా నిర్వాహకులను శిక్షించాలంటూ నిబంధనలను మార్చిందని చెప్పారు. భోపాల్ దుర్ఘటన జరిగినా యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్ర..

అస్సాం సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయని, అస్సాంలో ముస్లిం వ్యతిరేకతను పెంచడం ద్వారా మత వైషమ్యాలను పెంచి గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అరుణ్ కుమార్ విమర్శించారు. బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వచ్చారని ప్రచారం చేస్తున్నదని చెప్పారు. అక్కడి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నదని అన్నారు. కార్పొరేట్లు, సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. కేరళ సీఎం పినరయి విజయన్ పై కూడా తప్పుడు కేసులను నమోదు చేసిందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీహార్, పశ్చిమ బెంగాల్ లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించారని గుర్తుచేశారు. ఈసీ పక్షపాత. వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఈసీ అమలు చేస్తుందని చెప్పారు. మతం, కులం ఆధారంగా దాడి పెరిగిపోతున్నాయని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ, ఆరు గ్యారంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్, దావోస్ పర్యటనలు చేసినా పెట్టుబడులు రాలేదని అన్నారు. ప్రచారార్భాటం తప్ప ఏమీ లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్, టి సాగర్, మల్లు లక్ష్మి, పి ప్రభాకర్, బండారు రవికుమార్, నున్నా నాగేశ్వరరావు, ఎండీ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story