బీ-టీమ్‌తో ఎంపీపీ ఎత్తుగడ.. ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ ప్రచారం!

by Disha Web Desk 2 |
బీ-టీమ్‌తో ఎంపీపీ ఎత్తుగడ.. ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ ప్రచారం!
X

దిశ, చౌటుప్పల్: అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరగడంతో ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా.. హైదరాబాదుకు అతి సమీపంలోని నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన ఎంపీపీ వ్యవహారం కూడా బీ టీమ్‌ను మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యే పదవి తృటిలో చేజారిపోగా, ప్రస్తుతం మండల స్థాయి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నా అతనికి ఎమ్మెల్యే కావాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జితో విభేదించి సొంతంగా ఓ టీమ్ ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక లీడర్లు గుసగుసలాడుతున్నారు.

ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ ప్రచారం!

నియోజకవర్గంలో ఇప్పటికే రాష్ట్రంలో కీలకంగా ఉన్న నేతలు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా సదరు ప్రజాప్రతినిధి చేష్టలతో నియోజకవర్గ ఇన్చార్జ్ ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఇతర పార్టీలో ఉన్న ఆ ప్రజా ప్రతినిధిని అధికార పార్టీలోకి ఆహ్వానిస్తే, ఇప్పుడు తనకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడని నియోజకవర్గ ఇన్చార్జి పలువురి వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ శ్రేణులతో తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రస్థాయి నేతలతో సంప్రదింపులు

టీఆర్ఎస్ పార్టీలోని రాష్ట్రస్థాయిలో కీలక పదవిలో కొనసాగుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేత వద్దకు వెళ్లి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలంటూ సదరు ప్రజాప్రతినిధి చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన నానా పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఇప్పటికే పలువురు ఆశావహులతో ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గ ఇన్చార్జి తాజాగా ఆ ప్రజా ప్రతినిధి చేష్టలతో సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు ఎవరి వెంట ఉండాలో తెలియక అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా టీఆర్ఎస్ అధినాయకత్వం చొరవ తీసుకొని అసంతృప్తుల బెడద నుండి పార్టీ శ్రేణులను కాపాడే ప్రయత్నం చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed