HHVM: రోహిణ్ రెడ్డి సినిమా ఫైరవీ! సీఎం రేవంత్ రెడ్డిని ఇరికించిన క్లోజ్ ఫ్రెండ్!

by Prasad Jukanti |   (  Updated:2025-07-22 14:00:16  IST  )

హరిహర వీర మల్లు మూవీకి ప్రత్యేక రాయితీల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి లాబియింగ్ వ్యవహరం రచ్చగా మారుతోంది.

HHVM: రోహిణ్ రెడ్డి సినిమా ఫైరవీ! సీఎం రేవంత్ రెడ్డిని ఇరికించిన క్లోజ్ ఫ్రెండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్‌కల్యాణ్ నటించిన ‘హరిహర వీర మల్లు’ మూవీకి స్పెషల్ షోలు, టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా హరిహర వీరమల్లుకు స్పెషల్ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు సి.రోహిన్‌రెడ్డి పైరవీ చేశారనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీకి ప్రభుత్వం తరఫున ప్రత్యేక రాయితీల వెనుక రోహిన్‌రెడ్డి చక్రం తిప్పారన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఆ వీడియో నెట్టింట వైరల్..

‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ ఘటన కారణంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం నిరాకరించింది. కానీ రోహిన్‌రెడ్డే నాకు టికెట్లు ధర పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు ఇప్పించారు..’ అని చెప్పారు. అయితే తన పేరు ప్రస్తావిస్తూ రత్నం చేసిన వ్యాఖ్యలతో ఖంగుతిన్న రోహిన్‌రెడ్డి అందరు చూస్తుండగానే తలపట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిర్మాత రత్నం వ్యాఖ్యలతో రోహిన్‌రెడ్డి పైరవీ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆయన తీరు పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

లాబీయింగ్ చేయించడం ఏంటి..?

‘హరిహర వీరమల్లు’ విషయంలో రోహిన్‌రెడ్డి వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించే రోహిన్‌రెడ్డి ఈ తరహా లాబీయింగ్ చేయించడం ఏంటి? ఆయన చర్యలతో ప్రభుత్వానికి, పార్టీకి డ్యామేజ్ ఏర్పడుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఖైరతాబాద్ డీసీసీ చీఫ్‌గా ఉన్న రోహిన్‌రెడ్డి పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టి పూర్తిగా ఇలాంటి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా పార్టీలో వినిపిస్తున్నాయి. తాజాగా సినీ నిర్మాత వ్యాఖ్యలతో రోహిన్‌రెడ్డి పైరవీ విషయం తెలిసిందని, పార్టీ పెద్దలు అతడిని కంట్రోల్ చేయాలని, లేకపోతే పార్టీకి నష్టం తప్పదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో గుప్పుమంటోంది. మరి రోహిన్‌రెడ్డి వ్యవహారంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది వేచి చూడాలి.

Next Story