రెవెన్యూ శాఖకు గర్వకారణం.. ఐఏఎస్‌గా మారిన అనుభవజ్ఞులు

by Naga Rani Yarlagadda |

జీవన ప్రయాణంలో కొద్ది మందికే నిజమైన విజయం లభిస్తుందని, ఆ కోవకు చెందిన వారే ఐఏఎస్ పదోన్నతి పొందిన ఈ రెవెన్యూ అధికారులు అని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి అన్నారు.

రెవెన్యూ శాఖకు గర్వకారణం.. ఐఏఎస్‌గా మారిన అనుభవజ్ఞులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవన ప్రయాణంలో కొద్ది మందికే నిజమైన విజయం లభిస్తుందని, ఆ కోవకు చెందిన వారే ఐఏఎస్ పదోన్నతి పొందిన ఈ రెవెన్యూ అధికారులు అని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి అన్నారు. ట్రెసా, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఐఏఎస్ పదోన్నతి పొందిన రెవెన్యూ అధికారులను ఘనంగా సన్మాన కార్యక్రమం మహేశ్వరంలో జరిగింది. అనేక కాల పరీక్షలను ఎదుర్కొని, నిబద్ధతతో, అంకితభావంతో, నిజాయితీగా సేవలందించిన ఫలితంగానే ఈ స్థాయి సాధ్యమైందని రవీందర్ రెడ్డి తెలిపారు. కరిగిపోయే కొవ్వొత్తి తనను తాను త్యాగం చేసి వెలుగునిచ్చినట్లే, ఈ అధికారులు కూడా ఎన్నో త్యాగాల అనంతరం కాంతివంతంగా ప్రకాశిస్తూ సమస్త రెవెన్యూ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని ఆయన వివరించారు. టీజీడీసీఏ రాష్ట్ర అధ్యక్షులు విక్టర్ మాట్లాడుతూ.. 1995 బ్యాచ్‌కు చెందిన డిప్యూటీ తహశీల్దార్లకు ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్ పదోన్నతులు లభించడం చరిత్రలో తొలిసారి అన్నారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి వ్యక్తిగతంగా తనకే దక్కినట్లుగా భావిస్తున్నాడని అన్నారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. సన్మాన గ్రహీతలందరూ 30 సంవత్సరాలకు పైగా రెవెన్యూ శాఖలో అంకితభావంతో పని చేసి శాఖకు మూలస్తంభాలుగా నిలిచారని, ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలను ఎదుర్కొని నేడు గమ్యాన్ని చేరుకున్నారన్నారు. రెవెన్యూ ఉద్యోగులందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తి ప్రధాతలుగా నిలుస్తారని తెలిపారు. గత పీఆర్సీ సందర్భంలో రెవెన్యూ సర్వీసెస్ రూల్స్‌ను మార్చేందుకు కొన్ని లోపాయికారీ ప్రయత్నాలు జరిగినప్పుడు, ట్రెసా నాయకత్వం అప్రమత్తమై, వంగ రవీందర్ రెడ్డి నాయకత్వంలో ప్రతినిధి బృందం పీఆర్సీ కమిటీకి నివేదించి, సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ సర్వీస్ రూల్స్‌ను చెక్కుచెదరకుండా కాపాడుకున్నామని గుర్తు చేశారు.

భూ సమస్యల పరిష్కారానికే..

రెవెన్యూ పరిపాలనపై అపారమైన అనుభవం కలిగిన ఈ ఐఏఎస్ అధికారులను భూ భారతి సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లుగా నియమించాలనే అంశంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ట్రెసా నాయకత్వాన్ని కోరారు. అదే విధంగా అదనపు కలెక్టర్ జాబ్ చార్ట్‌కు ప్రభుత్వ ఆమోదం పొందేందుకు కూడా కృషి చేయాలని సూచించారు. సన్మాన గ్రహీతలు తమ స్పందనలో మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటి వరకు ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ తమ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రెవెన్యూ శాఖ అనేది విశేషాధికారాలు, విశాల బాధ్యతలు కలిగిన వ్యవస్థ కావడంతోనే ఈ శాఖను ఎంపిక చేసుకున్నామని, ఐఏఎస్ సాధిస్తామనే ఆశావహ దృక్పథంతో సేవలో చేరి ఈ స్థాయికి చేరుకోవడం మానసిక సంతృప్తిని కలిగించిందన్నారు. రెవెన్యూ ఉద్యోగులందరం ఒకే తల్లి బిడ్డలమని, పదోన్నతుల వల్ల మన మధ్య దూరం పెరగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీజీడీసీఏ మాజీ అధ్యక్షులు కె.చంద్ర మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.చంద్రకళ, కోశాధికారి చోల్లేటి వెంకటేశ్వర్లు, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.వెంకట ఉపేందర్ రెడ్డి, టీజీఓ అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, ట్రెసా కార్యవర్గ సభ్యులు జి.దేశ్యా, వాణి రెడ్డి, నాగమణి, మనోహర్ చక్రవర్తి, కృష్ణయ్య, బొమ్మ రాములు,ఎం. నారాయణ రెడ్డి, రమన్ రెడ్డి, గంగాధర్,రామకృష్ణ రెడ్డి, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, మీర్ ముర్తుజా అలీ, రాజేందర్, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, టీజీడీసీఏ , ట్రెసా రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని ఐఏఎస్ పదోన్నతి పొందిన అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Next Story