- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను కొనసాగించాలి: ట్రెసా
టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు ఎంతో కాలంగా రెవెన్యూ శాఖలో సేవలు అందిస్తున్నారని వారిని విధుల నుంచి తొలగించకుండా కొనసాగించాలని మంత్రి పొంగులేటిని ట్రెసా కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు, వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం సీసీఎల్ఏ కార్యాలయం నుంచి జారీ చేసిన మెమో ప్రకారం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ అంశంలో పెద్ద సంఖ్యలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు ట్రెసా కార్యాలయానికి చేరుకొని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ లను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దాంతో ఇదే అంశంపై సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలచే నియమించబడిన టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు ఎంతో కాలంగా రెవెన్యూ శాఖలో నిరంతరాయంగా సేవలు అందిస్తూ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీరిలో చాలా మంది వయోపరిమితి దాటిపోయినందున ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అర్హత కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో 473 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సుమారు 4000 వరకు జీపీవో పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, భూ పరిపాలన కార్యక్రమాల అమలులో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలు అత్యంత అవసరమని మంత్రికి వివరించారు. ఈ మధ్య వీరిపై మీడియాపై వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారమైనవని, వీరికి వివాదాలకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇతర శాఖలైన ఐకేపీ, పంచాయతీ రాజ్ శాఖలలో వేలాది మంది కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేసిన సందర్భాలను ప్రస్తావిస్తూ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా తగిన న్యాయం చేయాలని ట్రెసా నాయకత్వం కోరింది. 632 మంది సిబ్బంది, వారి కుటుంబాల సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం, జీవనోపాధి పూర్తిగా ఈ ఉద్యోగంపై ఆధారపడి ఉందన్నారు. ఈ విషయంపై స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో నివేదిక తెప్పించుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






