వైట్ నంబరు ప్లేట్‌లతో ప్రయాణం.. Sajjanar సీరియస్!

by Disha Web Desk 4 |
వైట్ నంబరు ప్లేట్‌లతో ప్రయాణం.. Sajjanar సీరియస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వైట్ నంబరు ప్లేట్‌తో ప్రయాణికులను తరలిస్తున్నారని, రాబోయే పండుగల సమయంలో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలను చేర్చేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైందన్నారు.

ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. టీఎస్ ఆర్టీసీకి పోలీస్, రవాణా శాఖలు ఎంతగానో సహకరిస్తున్నాయన్నారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు.

వెయ్యి బస్సులు అదనం...

గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ,శంషాబాద్‌లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని, దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామన్నారు.

ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియమిస్తున్నామన్నారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఆర్టీసీ ఇటీవల తీసుకువచ్చిన గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.inలో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

ఈ సమన్వయ సమావేశంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అశోక్ కుమార్, శ్రీనివాస్, రాచకొండ, ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీలు రణవీర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రవాణా శాఖ చెందిన ఆర్టీఏలు రఘునందన్ గౌడ్(ఇబ్రహీంపట్నం), రామచందర్(హైదరాబాద్ సెంట్రల్), శ్రీనివాస్ రెడ్డి (హైదరాబాద్ నార్త్)తో పాటు టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed