Dasara Gift: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టీజీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా – భారీ బహుమతులు సిద్ధం.. వివరాలు ఇవే

by Ramesh Naini |

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

Dasara Gift: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టీజీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా – భారీ బహుమతులు సిద్ధం.. వివరాలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు (TGSRTC) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ (Dussehra festival) నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే వారికి (Lucky draw) లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్‌కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్‌కు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది.

ఈ లక్కీ డ్రా లో పాల్గొనాలంటే ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహారి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులు అని సంస్థ తెలిపింది. ఈ సర్వీసుల్లో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్‌పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌ల్లో వేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణనలోకి తీసుకుంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను అక్టోబర్ 8న అధికారులు ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి సంస్థ ఘనంగా సన్మానిస్తోంది.

దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar) గురువారం ఒక ప్రకటనలో కోరారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ప్రయాణికుల సౌకర్యార్థం 7754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు.

Next Story