రాష్ట్రంలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం.. 245 కేసులు నమోదు, 60 బస్సులు సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-15 10:46:44  IST  )

రాష్ట్రంలో స్కూళ్లు పున: ప్రారంభమైన తొలిరోజే రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై ఉక్కుపాదం మోపారు.

రాష్ట్రంలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం.. 245 కేసులు నమోదు, 60 బస్సులు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో నేటి నుంచి పాఠశాలలు రీ ఓపెన్ అయిన నేపథ్యంలో విద్యార్థులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఇవాళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు (Special Drive) నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు మినిమమ్ ఫిట్‌నెస్ లేని 60 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు.

అత్యంత పకడ్బందీగా తనిఖీలు..

బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (Fitness Certificate) లేకపోవడం, సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడం (Overloading), భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి. రానున్న రోజుల్లో కూడా స్పెషల్ రెయిడ్స్ మరిన్ని కొనసాగుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. తనిఖీలో భాగంఘా ప్రధానంగా వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ (PUC) సర్టిఫికేట్ ఉన్నాయా లేదా చూస్తున్నారు. సామర్థ్యానికి మించి బస్సుల్లో విద్యార్థులను కుక్కడం, డ్రైవర్లకు వాలిడ్ లైసెన్స్‌తో పాటు తగినంత అనుభవం ఉందా లేదా, బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సక్రమంగా ఉన్నాయా అనే విషయాలపై ఫోకస్ పెట్టారు. విద్యార్థులు బస్సులు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు బస్సులో అటెండర్‌ను నియమించారా అని అడిగి తెలుసుకుంటున్నారు.

యాజమాన్యాలదే పూర్తి బాధ్యత..

విద్యాసంస్థల విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, నిబంధనల పాటిండంలో అలసత్వం వహిస్తే.. అందుకు పూర్తి బాధ్యత సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యాలదేనని రవాణా శాఖ తేల్చి చెప్పింది. మోటార్ వాహన చట్టం (Motor Vehicles Act) ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు, యాజమాన్యాలపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 25,987 విద్యాసంస్థల బస్సులుండగా, ఇప్పటి వరకు 23,204 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాయి. మిగిలిన 2,783 బస్సులు వెంటనే ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరై సర్టిఫికెట్ తీసుకోవాలని రవాణా శాఖ సూచించింది. అదేవిధంగా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పంపే వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్లను ముందుగానే సరిచూసుకోవాలని రవాణా శాఖ కోరింది.

Next Story