- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ చేతుల్లోకి యాదాద్రి పవర్ ప్లాంట్.. ఉద్యోగుల గుండెల్లో రైళ్లు!
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని నాటి సీఎం కేసీఆర్ ముందు చూపుతో విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.

దిశ నల్లగొండ బ్యూరో: తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని నాటి సీఎం కేసీఆర్ ముందు చూపుతో విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దాంతో చీకటి నుంచి వెలుగు రేఖలు నిండాయి. అయితే పవర్ ప్లాంట్ మున్నాళ్ల ముచ్చటే అన్న చందంగా ఎంతో ఆశతో నిర్మించుకున్న ప్లాంటు మరికొద్ది రోజుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుందని సమాచారం. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు కంపేనీల చేతుల్లోకి కంపేనీ వెళితే తక్కువ వేతనాలకు పనిచేయాల్సి ఉంటుంది, స్థానికులకు ఉద్యోగులకు గ్యారంటీ లేదు. ఇంకా చాలా నష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణంతోనే రాష్ట్ర ప్రజలలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రగాఢమైన నమ్మకం కుదిరిందని వాపోతున్నారు.
పవర్ ప్లాంట్ రూ.25099 కోట్లతో..
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో సుమారు 4600 ఎకరాలలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రూ.25099 కోట్లతో అంచనా వ్యయంతో 4 వేల మెగవాట్ల సామర్థ్యంతో నిర్మించాలని భావించారు. కానీ రైతుల నుంచి 700 ఎకరాలు, ఫారెస్ట్ నుంచి 1200 ఎకరాలు తీసుకున్నారు. 2015 జూన్ 6 నాటి సీఎం కేసీఆర్ శంకుస్థపాన చేశారు. ప్లాంటు శంకుస్థాపన చేసిన రోజున ప్లాంటు బడ్జెట్ అంచనా రూ.20599 కోట్లు. కానీ ఇపుడు ఆ బడ్జెట్ సుమారు రూ.3700 కోట్లకు వెళ్ళినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దేశంలోనే అతిపెద్ద నాలుగో ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. ఆ బడ్జెట్ కూడా మరింత పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ ప్లాంటులో ఇపుడు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది.
1300 మంది ఉద్యోగులు విధులు..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో సుమారు 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో సీఈ 2, ఎస్ ఈ 12, డీఈ 72, ఏడీఈ 170, ఏఈ 180 మంది కాగా.. మొత్తంగా 450 మంది ఇంజినీర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఒఎల్ఎం స్టాఫ్ 410, ల్యాండ్ ల్యూజర్లు, ఇండ్లు కొల్పోయిన వారితో పాటుగా దాదాపు పవర్ ప్లాంట్‌లో 1300 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. ల్యాండ్ కోల్పోయిన వారందరికీ పరిహారం ఇచ్చామని చెపుతున్నప్పటికీ చాలామంది రైతులు తమకు పరిహారం రాలేదని కలెక్టరేట్ చుట్టు నేటికి తిరుగుతున్నారు.
ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్..
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రవేటు పరం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటీస్ విడుదల చేసింది. ఈ e.CEG/SEG/E4A25/YTPS/5*8--MW/0@M/AHP@CHP/35/2026-27 విడుదల చేశారు. కాంట్రాక్టు కాలం మూడేళ్లు ఉంటుంది. కాంట్రాక్టు అంచనా విలువ రూ.255 కోట్లుగా ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్ నిర్వహించడానికి అర్హత కలిగిన కంపేనీల నుంచి ఒపెన్ టెండర్ ద్వారా కంపేనీని నిర్వహణను అప్పగించేందుకు చూస్తున్నారు. దీంతో ఆంధ్రా పెట్టుబడి దారుల చేతుల్లోకి ఈ ప్లాంట్ వెళ్లనుంది. దాంతో తిరిగి ఆంధ్రా పెత్తనం ఏర్పడనుందనేదానికి ఇదొక ఉదహరణ. ఇదిలా ఉంటే టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. జూన్ 12, 2026 టెండర్లు వేయడం మొదలవుతుండగా జూన్ 29 ముగుస్తుంది. జులై 2న, 2026న టెండర్ ఓపెన్ చేయనున్నారు.
ఉద్యోగుల ఆందోళన..
తెలంగాణ విద్యుత్ చీకటి పొరల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ పవర్ ప్లాటు ఇది. ఎట్టి పరిస్థితులలో ప్రవేటు పరం చేయొద్దని, ఒకవేళ చేసిన సహించే ప్రసక్తేలేదని పవర్ ప్లాంట్ ఉద్యోగులు ఐకాస ఏర్పాటు చేసుకున్నారు. వైటీపీఎస్‌ను కాపాడండి.. జెన్ కోను కాపాడండి.. ప్రవేటు పరం చేయడం తెలంగాణ స్ఫూర్తికి విరుద్దం అంటూ ఉద్యోగులంతా రెండు రోజుల క్రితం పవర్ ప్లాంటు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సరైంది కాదని, యంత్రాంగం పునరాలోచన చేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తుల చేతులకి వెళ్తే నష్టపోయేది నిరుద్యోగులే: వంగూరి వెంకన్న, టీఎస్ఎస్సీ ఎస్టీ వేల్ఫేర్ అసోసియేషన్
సీహెచ్ పీ, హెచ్ పీ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఎక్కువగా నష్టపోయేది రాష్ట్రంలోని నిరుద్యోగులే. స్థానికంగా ఉన్న వాళ్లకి ఉపాధి కూడా దొరకదు. ప్రైవేట్ కంపెనీలు వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్లని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. తక్కువ వేతనాలు, ఎక్కువ గంటల్లో పని దినాలు చేయించుకుంటారు. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో నడిస్తే రెగ్యులర్‌గా ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుంది స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఇంజినీర్లు, ఉద్యోగులు ఎక్కువ బాధ్యత పనిచేస్తారు.






