పారదర్శకతే మాయమా?.. తెలంగాణ ఆన్‌లైన్ ఆర్టీఐ ఘోర వైఫల్యం

by Naga Rani Yarlagadda |

పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ప్రధాన లక్ష్యంతో గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది.

పారదర్శకతే మాయమా?.. తెలంగాణ ఆన్‌లైన్ ఆర్టీఐ ఘోర వైఫల్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ప్రధాన లక్ష్యంతో గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రజాధనం ఏ శాఖల్లో, ఏ విధంగా ఖర్చవుతోంది?.. తదితర వివరాలను సామాన్య ప్రజలు తెలుసుకునే అవకాశం కలిగింది. తద్వారా ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకాన్ని పెంచే దిశగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా రానురాను ఈ చట్టం లక్ష్యం నీరుగారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ‘పారదర్శక పాలన’ నినాదంతో ప్రారంభించిన ఆన్‌లైన్ ఆర్టీఐ వ్యవస్థ ప్రజలకు సమాచారం అందించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ విషయాన్ని ఆర్టీఐ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

అప్పీల్ దరఖాస్తులు మరీ దారుణం..

మూడేళ్లుగా అమల్లో ఉన్న ఆర్టీఐ వ్యవస్థ ప్రజల హక్కులను కాపాడటానికి కాకుండా, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే సాధనంగా మారిందనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఐ ద్వారా పొందిన అధికారిక గణాంకాల ప్రకారం.. ఆన్‌లైన్​ఆర్టీఐ పోర్టల్ అమల్లోకి వచ్చిన గత మూడేళ్ల కాలంలో మొత్తం 17,805 దరఖాస్తులు రాగా 377 మాత్రమే పరిష్కారమైన తీరు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అంటే రెండు శాతం కూడా పరిష్కారం కాలేదని లెక్కల ద్వారా స్పష్టం అవుతోంది. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. 2,502 మొదటి అప్పీల్ దరఖాస్తులు వచ్చినప్పటికీ, ఒక్క అప్పీల్‌‌కు కూడా పరిష్కారం చూపలేదు. సమాచార హక్కు చట్టంలో కీలకమైన అప్పీల్ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం అయినట్లుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వెబ్ పోర్టల్ రికార్డుల ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఆర్టీఐ వ్యవస్థలో 3,323 రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఆన్‌బోర్డ్‌లో ఉన్నట్టు చూపుతున్నారు. కానీ వాస్తవ వినియోగంలో మాత్రం కేవలం 17 శాఖలు మాత్రమే పోర్టల్‌ను ఉపయోగిస్తున్నాయి. మిగిలిన వేలాది శాఖలు ఆన్‌లైన్‌లో ఆర్టీఐ వ్యవస్థకు దూరంగా ఉండటం వల్ల దరఖాస్తులు ఎటూ తేలని పరిస్థితి నెలకొన్నది.

పనిచేయకున్నా చెల్లింపులు ఎలా?..

ఆర్టీఐ దరఖాస్తుదారుల అనుభవాలు మరింత భయానకంగా ఉన్నాయి. పోర్టల్ తరచూ పనిచేయకపోవడం, ఓటీపీలు రాకపోవడం, అప్పీలు దాఖలు చేసే అవకాశం లేకపోవడం సాధారణ సమస్యలుగా మారాయి. ఫిర్యాదు చేసినా, కాంటాక్ట్ చేసినా నెలల తరబడి ఎలాంటి స్పందన లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపమా..? లేక వ్యవస్థాగత నిర్లక్ష్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్టీఐ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణ కోసం మెస్సర్స్ ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు, మెస్సర్స్ అప్‌స్టీర్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి బీఆర్‌ఎస్​హయాంలో మూడేళ్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ విలువ రూ.2.07 కోట్లు. ఆర్టీఐ సమాచారం ప్రకారం.. కాంట్రాక్ట్ గడువు 2025 డిసెంబర్‌తో ముగిసింది. ఇప్పటివరకు రూ.1.51 కోట్లు సంస్థకు చెల్లించారు. అయితే పనితీరు గణాంకాలు చూస్తే సంస్థ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తవారికి ఇంకా కాంట్రాక్టు అప్పగించలేదు. కొత్తగా టెండర్లు కూడా పిలవలేదు. దీంతో ఇదే సంస్థ కొనసాగుతోంది.

ఎక్స్‌టెన్షన్ ఇచ్చారా..?

ప్రభుత్వ శాఖల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు ఈ వైఫల్యాన్ని ఎలా విస్మరించారు..? పోర్టల్ సరిగా పనిచేయకపోయినా, దరఖాస్తులు పరిష్కారం కాకపోయినా చెల్లింపులు ఎలా కొనసాగాయి? కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత కూడా ఈ సంస్థను కొనసాగిస్తున్నారా..? ఎక్స్‌టెన్షన్ ఇచ్చారా..? అన్న విషయాలపై ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడంలేదు. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఈ కాంట్రాక్ట్, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతూ చెల్లింపులు జరగడం మరో కీలక అంశం. ప్రభుత్వాలు మారినా, విఫలమైన కాంట్రాక్ట్ సంస్థకు ఏ విధంగా చెల్లింపులు చేస్తున్నారు అనేది కీలక ప్రశ్నగా మారింది. కాంట్రాక్ట్ సంస్థపై విచారణ జరిపించాలనే డిమాండ్లు వస్తున్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story