- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో బదిలీల దందా: రూ.20 లక్షలు ఇస్తేనే పోస్టింగ్
తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో బదిలీల పేరిట భారీ అక్రమాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫైర్ డిపార్ట్ మెంట్ లో బదిలీల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ముడుపులు ముట్టజెప్పిన వారిని ట్రాన్స్ ఫర్స్ నుంచి మినహాయించి, మిగతా వాళ్లను ప్రస్తుతం ఉన్న చోట నుంచి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం పని చేస్తున్న ప్లేస్, హోదా ప్రకారం ఒక్కో వ్యక్తి నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ విషయంపై బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపణలు వస్తున్నాయి. న్యాయం చేయాల్సిన అధికారులే మౌనంగా ఉండటంతో ఈ అక్రమాలకు సపోర్ట్ చేస్తున్నారేమోననే అనుమానం ఉద్యోగుల్లో నెలకొన్నది.
రూల్స్‌కు విరుద్ధంగా మెరిట్ లిస్ట్
సాధారణ బదిలీల కోసం ప్రభుత్వం జీవో 38ను విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం ఒకే చోట మూడేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఒకే స్టేషన్ లో (సిటీ, టౌన్, విలేజ్) నాలుగేళ్లు దాటి పని చేస్తున్న వ్యక్తులను తప్పనిసరిగా బదిలీ చేయాలని కండీషన్ ఉన్నది. కానీ ఫైర్ డిపార్ట్ మెంట్ లో ‘స్టేషన్’ అనే పదానికి ఫైర్ స్టేషన్ గా అర్థం మార్చి, సొంతంగా నిబంధనలను రూపొందించుకున్నట్లు తెలిసింది. డిపార్ట్ మెంట్ లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్ ఫైటర్, ఫైర్ ఫైటర్ టెక్నికల్ అనే పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయి. ఈ మూడు రకాల పోస్టుల్లో నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే జోన్ లో పని చేస్తున్న వ్యక్తులను నిబంధనల ప్రకారం ఇతర జోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలి. కానీ డిపార్ట్ మెంట్ లోని కీలక అధికారులు మామూళ్లు ఇచ్చిన వ్యక్తులు అదే జోన్ లో కొనసాగేలా మెరిట్ లిస్టును రెడీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కొందరు అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు
ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా బదిలీలు చేసేందుకు ఒక్కో పోస్టు హోదా మేరకు రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ దందా డైరెక్టరేట్ లో పని చేస్తున్న కొందరు అధికారుల ప్రమేయంతో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024లో జరిగిన జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో సైతం ఇదే తరహాలో డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం ఉన్నది. అయితే ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు ప్రయత్నించినా.. ప్రయోజనం లేదనే చర్చ జరుగుతున్నది.
వంద మందికి అన్యాయం!
ఫైర్ డిపార్ట్ మెంట్ తయారుచేసుకున్న సొంత రూల్స్ తో మూడు కేడర్లలో (ఎస్ఎఫ్ఓ, ఎఫ్ఎఫ్టీ, ఎల్ఎఫ్ఎఫ్) ఉన్న సుమారు వంద మందికి అన్యాయం జరుగుతున్నట్లు తెలిసింది. ఉదాహరణకు ‘ఏ’ అనే వ్యక్తి జోన్-6లో 2008లో ఉద్యోగంలోకి చేరి అప్పటి నుంచి ఆ వ్యక్తి వివిధ స్టేషన్లలో, వివిధ హోదాల్లో పనిచేస్తూ 2016లో స్టేషన్ ఆఫీసర్ గా ప్రమోషన్ పొందారు. కానీ ప్రమోషన్ పొందిన కాలం నుంచి హైదరాబాద్ సిటీలోనే పలు ఫైర్ స్టేషన్లలో పనిచేశారు. 2024లో జరిగిన సాధారణ బదిలీల్లో హైదరాబాద్ సిటీ పరిధిలో మరో స్టేషన్ కు బదిలీ అయ్యారు. కానీ అతను ఆ స్టేషన్ లో పని చేస్తున్న కాలం కేవలం రెండున్నరేళ్లుగా లెక్కించి బదిలీ నుంచి మినహాయించారు. కానీ 2022 మేలో ఇతర జోన్ నుంచి హైదరాబాద్ కు బదిలీ అయిన స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ను మాత్రం ట్రాన్స్ ఫర్ చేసేందుకు మెరిట్ లిస్ట్ రెడీ చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో ‘మామూళ్ల’ మజా వేరు
ఫైర్ డిపార్ట్ మెంట్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేసేందుకు అధికారులు పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. ఎందుకంటే సిటీ జీవితానికి అలవాటు పడటం ఒక కారణమైతే, ఇక్కడ ఫైర్ స్టాఫ్ కు వివిధ రకాలుగా వచ్చే నెల వారీ మామూళ్లు పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం ఉంది. ప్రధానంగా బిల్డింగ్స్, హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లకు కావాల్సిన ఫైర్ సర్టిఫికెట్స్, రెన్యూవల్స్ కోసం పెద్ద ఎత్తున మామూళ్లు తీసుకుంటారని టాక్ ఉంది. ఆ విధంగా వచ్చే అక్రమ ఆదాయం కోసం హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వదిలి ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపెట్టరనే ఫిర్యాదులు ఉన్నాయి.






