జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు : ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదు

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం రేగింది.

జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు : ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం రేగింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేసు నమోదైంది. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఉదయ్ కృష్ణారెడ్డి తనకు నిరంతరం అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ, మానసికంగా వేధిస్తూ, దుర్భాషలాడుతున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

కత్తితో బెదిరించి.. ప్రైవేట్ వీడియోలు తీసి..

బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను జూలై 9వ తేదీన జుట్టుపట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. అంతటితో ఆగకుండా, ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని, ఆ ప్రైవేట్ వీడియోలను ఆమె భర్తకు వాట్సాప్ ద్వారా పంపాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 74,75,77, 315(2), ఐటీ యాక్ట్ 66 (సి) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై త్వరలోనే ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ను నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రంలో.. కాబోయే ఐపీఎస్ అధికారుల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Story