అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణకు స్థానికులకు శిక్షణ ఇవ్వండి : మంత్రి కొండా సురేఖ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రవ్యాప్తంగా అటవీ అగ్నిప్రమాదాలను తగ్గించేందుకు స్థానికులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు.

అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణకు స్థానికులకు శిక్షణ ఇవ్వండి : మంత్రి కొండా సురేఖ
X
  • అటవీ పరిరక్షణ కోసం ఏ చర్యలకైనా వెనకంజ వద్దు
  • అటవీ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అటవీ అగ్నిప్రమాదాలను తగ్గించేందుకు స్థానికులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. అటవీ పరిరక్షణ కోసం ఎంతటి చర్యలైనా తీసుకోవడంలో వెనకడుగు వేయొద్దని అటవీ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శనివారం సచివాలయంలోని మంత్రిపేషిలో జరిగిన ‘తెలంగాణ హరితనిధి’ రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణతో పాటు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం అటవీ, టూరిజం, పరిశ్రమల శాఖలతో త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలకు మరింత శాస్త్రీయ విధానాలు అందించాలని సూచించారు. హరితనిధి వినియోగంపై సమగ్ర చర్చ జరగగా, నర్సరీల ఏర్పాటు, మొక్కల నాటకం, నీటి సరఫరా, మొక్కల సంరక్షణ, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రణాళికల అమలు, పర్యవేక్షణ వంటి అంశాలను మంత్రి పరిశీలించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా సమీక్ష జరిగింది.

అటవీ సంరక్షణతో పాటు వణ్యప్రాణుల సంరక్షణకు..

అడవుల్లో అగ్నిప్రమాదాలను అరికట్టడం అత్యవసరమని, అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ఇది అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఫైర్ కంట్రోల్ చర్యల్లో శాస్త్రీయ విధానాలు మరింతగా ప్రవేశపెట్టాలని, ప్రస్తుత వ్యవస్థలో ఏ ఇబ్బందులైనా ఎదురైతే వెంటనే మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు హరితనిధి కింద గంధపు చెక్క, వెదురు, టేకు, శాంటాలమ్ ఆల్బమ్ నర్సరీల అభివృద్ధి, 26 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి-నిర్వహణ, నాలుగు ఎకో టూరిజం ప్రాజెక్టుల పురోగతి, కాకతీయ జూలాజికల్ పార్క్ అభివృద్ధి, హనుమకొండలో 24 గ్రీనరీ ప్రాజెక్టులు, సిబ్బంది సామర్థ్య శిక్షణలు, విద్యార్థుల కోసం వనదర్శిని కార్యక్రమం, నాగార్జునసాగర్ వన్యప్రాణి నిర్వహణ, నారాయణపేటలో బ్లాక్‌బక్ రెస్క్యూ-పునరావాస కేంద్రం, వరంగల్-మేడారం సమ్మక్క-సారక్క కారిడార్‌లో అవెన్యూ ప్లాంటేషన్, ములుగు జిల్లా మాస్ ట్రీ ఫాల్ వద్ద పునరుజ్జీవన కార్యక్రమాలు జరుగుతున్నట్లు వివరించారు. హరితనిధి కింద 2025–26 బడ్జెట్ అవసరాలపై కూడా సమావేశంలో చర్చ సాగింది. సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) డాక్టర్ సువర్ణ, సునీత భగవత్, సీసీఎఫ్ డాక్టర్ జి. రామలింగం, డాక్టర్ బీమా నాయక్, ప్రియాంక వర్గీస్, అన్ని జిల్లాల డీఎఫ్ఓలు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story