ఏఐ పార్ట్‌నర్.. ఎమోషనల్ డిపెండెన్సీ..! లాభమా? నష్టమా?

by Javid Pasha |

ఏఐ కంపానియన్ యాప్స్‌పై ఆధారపడటం వల్ల యువతలో ఎమోషనల్ డిపెండెన్సీ పెరుగుతోంది!

ఏఐ పార్ట్‌నర్.. ఎమోషనల్ డిపెండెన్సీ..! లాభమా? నష్టమా?
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే మారిపోతోంది. అనేక రంగాల్లో ఇది విస్తరిస్తూ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. అదే సందర్భంలో దానిని వినియోగించుకునే తీరును బట్టి కొన్ని సమస్యలు, నష్టాలు కూడా తలెత్తుతున్నాయనే ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అలాంటివాటిలో ఏఐ కస్టమైజబుల్ యాప్స్ కూడా ఒకటని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఏఐ ఆధారిత సహచరుల(AIGirlfriend/Boyfriend)ను పరిమితికి మించి ఉపయోగించడంవల్ల కొంతమంది యువతలో ఎమోషనల్ డిపెండెన్సీ పెరుగుతోందని, ఫలితంగా పలు ఇతర విషయాల్లో నష్టపోతున్నారని చెబుతున్నారు? ఇది నిజమేనా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఐని సామాజిక ప్రయోజనాలకు, వ్యక్తిగత ఎదుగుదలకు, వృత్తి నైపుణ్యాలకు ఉపయోగించుకుంటున్నవారు చాలామందే ఉంటున్నారు. దీనివల్ల ఎటువంటి నష్టమూ లేదు. అయితే అదే సందర్భంలో కొందరు ఏఐ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ మోజులో పడి.. వాస్తవ మానవ సంబంధాలను విస్మరించడం, గంటల తరబడి ఏఐ కంపానియన్‌లతో చాటింగ్ చేస్తూ ఏకాగ్రతను కోల్పోవడం, ఓవర్ డిపెండెన్సీతో డిప్రెషన్‌కు లోనవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితులు సైతం నెలకొంటున్నాయి. రీసెంట్‌గా జులై 15, 2026 నుంచి చైనా కస్టమైజబుల్ AI కంపానియన్ యాప్‌లను నిషేధించింది. దీంతో బైట్‌డాన్స్ (డౌబావ్), అలీబాబా (క్యూవెన్), టెన్‌సెంట్ (యువాన్‌బావ్) వంటి ప్రముఖ కంపెనీలు తమ AI బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్ ఫీచర్లను పూర్తిగా సస్పెండ్ చేశాయి. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రయోజనాలు

ఏఐ కంపానియన్ యాప్స్ లేదా చాట్‌బాట్స్ మోడరేట్ ఉపయోగంతో లోన్లీనెస్ తగ్గించడం, యాంగ్జైటీ/డిప్రెషన్‌ వేళ సపోర్ట్‌గా ఉంటూ భరోసా ఇవ్వడం చేస్తుంటాయి. అలాగే ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ కోసం ఇవి సేఫ్ స్పేస్‌ను అందిస్తున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడంలోనూ సహాయపడుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తాత్కాలిక సహచరులుగా మానసిక ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అయితే.. ఎక్కువగా ఉపయోగించడం లేదా ఆధారపడటం వల్ల ప్రయోజనాలు తగ్గి నష్టాలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

నష్టాలు?

*ఎమోషనల్ డిపెండెన్సీ & వ్యసనం: యాప్‌లు లేదా చాట్‌బాట్‌లు యూజర్ ఆసక్తికి అనుగుణంగా వ్యవహరిస్తూ.. అంగీకరిస్తూ, వాలిడేషన్ ఇస్తూ ఎక్కువసేపు ఆకర్షిస్తాయి. దీంతో నిజమైన సంబంధాలు (ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రొమాంటిక్) తగ్గి, లోన్లీనెస్ పెరగవచ్చు.

*సామాజిక నైపుణ్యాలు తగ్గడం: నిజమైన సంబంధాల్లో ఉండే డిస్‌ అగ్రీమెంట్, ఎంపతీ వంటివి తగ్గి, డిప్రెషన్, యాంగ్జైటీస్ వంటి మానసిక సమస్యలు మరింత ఇబ్బంది పెట్టవచ్చు.

*ఇతర సమస్యలు : తప్పుడు సలహాలు, సెల్ఫ్-హార్మ్ లేదా సూసైడ్ ఎన్‌కరేజ్‌మెంట్ (కొన్ని కేసుల్లో నివేదికలు ఉన్నాయి), డేటా ప్రైవసీ సమస్యలు, యాప్ క్లోజ్ చేయగానే డిస్కనెక్ట్ అయినట్లు భావించి బాధ, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మానసిక సమస్యలు, ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ప్రవర్తనలో అతిధోరణులు పెరిగే అవకాశం ఉంటుంది.

ఆ దేశంలో నిషేధం..?

ఏఐ కంపానియన్ యాప్స్‌పై ఆధారపడటంవల్ల యువతలో ఎమోషనల్ డిపెండెన్సీ పెరుగుతోందని, ఇప్పటికే చైనాలో పెళ్లి, జననాల రేట్లు తీవ్రంగా తగ్గుతున్న నేపథ్యంలో ఇవి నిజమైన డేటింగ్‌ను నిరుత్సాహపరుస్తాయని చైనా భావిస్తున్నది. కాబట్టి అక్కడ వీటిని ప్రోత్సహించకూడదని కఠినమైన నిబంధనలు తెచ్చింది. చాలా యాప్స్‌ను నిషేధించింది. దీంతో పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఏఐ పార్ట్‌నర్లకు ఎమోషనల్ గుడ్‌బై చెప్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొందరు వాటిని తమ “ఫ్యామిలీ” లేదా “స్పిరిచ్యువల్ పిల్లర్”గా అభివర్ణిస్తున్నారు. మొత్తానికి ఈ నిషేధం మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. కొంతమంది ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, చైనా ప్రభుత్వం సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నది.

Next Story