ఒట్లు, తిట్లమీద ఉన్న ధ్యాస నీటి బొట్లమీద పెట్టు.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు

by Prasad Jukanti |

దేవాదుల నీళ్లను ఎత్తిపోసే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదని హరీశ్ రావు మండిపడ్డారు.

ఒట్లు, తిట్లమీద ఉన్న ధ్యాస నీటి బొట్లమీద పెట్టు.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను పూర్తిస్థాయిలో నడపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనివల్ల ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల వద్ద 10 మోటార్లు రన్ చేస్తామని గొప్పలు చెప్పిన మంత్రులు, ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోయడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. జులై 12న బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతే మంత్రులు ఉత్తమ్, భట్టి, పొంగులేటి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారే తప్ప క్షేత్రస్థాయిలో పూర్తి పంపుల్ ఆన్ చేయడం లేదన్నారు. మంత్రులు వెళ్లినప్పుడు ఏడు మోటార్లు, తర్వాత కేవలం మూడు మోటార్లే నడుపుతున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయమమంటే అక్కడా డ్రామాలు ఆడారు. ఇక్కడ ఎందుకు ఎత్తిపోయడం లేదు? ఇక్కడ పూర్తి మోటార్లు ఆన్ చేయడానికి ఏ ఎన్డీఎస్ఏ అడ్డు చెప్పిందని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా నీళ్ల మంత్రికి తెలియదని సెటైర్ వేశారు.

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు:

సమ్మక్క బ్యారేజీ గుండా ఇప్పటివరకు 105 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లిపోయాయని, ప్రభుత్వం మాత్రం కేవలం 1.9 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసిందని మండిపడ్డారు. రోజుకు పావు టీఎంసీ చొప్పున 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని హరీశ్ రావు దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో సమ్మక్క బ్యారేజీ పూర్తి చేసి, దేవాదుల మూడు ఫేజుల ద్వారా నీళ్లు ఎత్తడానికి సిద్ధంగా ఉంచితే, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రాంతం కరువు కోరల్లోకి వెళ్తోందన్నారు. చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? తెలంగాణ రైతులకు నీళ్లు ఒడిసిపట్టడమా? మీ ఆలోచన ఏమిటి? మంత్రులేమో 3 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామంటారు, వరంగల్ కలెక్టరేమో నాట్లు వేసుకోవద్దని అఖిలపక్ష సమావేశంలో చెబుతారు. మంత్రులది ఒక మాటైతే, కలెక్టర్‌ది మరో మాటనా అని నిలదీశారు.

తిట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తడంపై ఏది?:

బీఆర్ఎస్ నిలదీస్తేనే ప్రభుత్వానికి సోయి వస్తోందని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులపై చిల్లర రాజకీయాలు బంద్ చేసి దేవాదుల పరిధిలోని 10 మోటార్లను వెంటనే పూర్తిస్థాయిలో నడిపి దేవాదుల కింద ఉన్న 22 రిజర్వాయర్లను వెంటనే నింపి, 3.17 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాలన్నారు. ప్రభుత్వం వెంటనే కళ్లు తెరవకపోతే వరంగల్, నల్గొండ, కరీంనగర్ రైతాంగాన్ని సమీకరించి భారీ ప్రజాపోరుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రైతు బోరు ఎండితే నీళ్ల కోసం రకరకాల మార్గాలు వెతుకుతాడు. కానీ ప్రభుత్వం ఎందుకు తపన పడటం లేదని ప్రశ్నించారు. రైతులకు ఉన్న సోయి రేవంత్ రెడ్డికి లేదుని దుయ్యబట్టారు. ఎల్‌నినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ ఊరుకోదన్నారు. తిట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తడంపై లేదని, బీఆర్ఎస్‌ను ఆపడం నీ తరం కాదు. ముందు నీళ్లు ఎత్తడంపై దృష్టి పెట్టాలన్నారు.

Next Story