నల్లగొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం

by Kema Shiva Kumar |

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం జరిగింది.

నల్లగొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మృత్యువు ముంచుకురావడంతో ఆ ఇల్లాలు, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో మొదట విద్యుదాఘాతం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు గది అంతటా వేగంగా వ్యాపించి, పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు అంటుకున్నాయి. దీంతో సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, నిద్రిస్తున్న సమయం కావడం వల్ల బాధితులు ఇల్లు దాటి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో ఇల్లు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోవడంతో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఒకే కుటుంబానికి చెందిన చంద్రకళ (45), లక్ష్మణ్ (16), ప్రణతి (14)గా గుర్తించారు.

సిలిండర్ పేలిన భారీ శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఘటనా స్థలానికి పరుగులు తీశారు. అప్పటికే ఇల్లు దట్టమైన పొగలు, మంటలతో నిండిపోవడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తేగా అయితే, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story