తెలంగాణ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-13 05:10:50  IST  )

తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు ఇవాళ కన్నుమూశారు.

తెలంగాణ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూత
X

దిశ, ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ సీపీఎం నాయకుడు కొండిగారి రాములు (91) ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున 1989, 1994లో వరుసగా రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత నిజాయితీ గల ప్రజాప్రతినిధిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

సామాన్య జీవితమే ఆయన మార్గం..

1935లో మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జన్మించిన రాములు చిన్నతనం నుంచే కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, ఎలాంటి ఆస్తిపాస్తులు కూడబెట్టకుండా సామాన్య జీవితం గడిపిన అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు. నిబద్ధత, నిజాయితీ కలిగిన ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయం. రాములుకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు గతంలోనే అనారోగ్యంతో మరణించారు. ఆయన మూడో కుమారుడు కొండిగారి త్రిలోక్ కుమార్, ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం 12వ వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొండిగారి రాములు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story