ఉపాధ్యాయుల సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసిన టీపీయూఎస్.. పలు అంశాలపై వినతి

by Ramesh Naini |

మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన టీపీయూఎస్ ప్రతినిధి బృందం, ఉపాధ్యాయుల సమస్యలపై సమగ్ర వినతి పత్రాలను సమర్పించింది.

ఉపాధ్యాయుల సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసిన టీపీయూఎస్.. పలు అంశాలపై వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) దేశ రాజధానిలో గళమెత్తింది. మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన టీపీయూఎస్ ప్రతినిధి బృందం, ఉపాధ్యాయుల సమస్యలపై సమగ్ర వినతి పత్రాలను సమర్పించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసిన ప్రతినిధులు, రాష్ట్రంలో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి మధ్యతరగతి ఉపాధ్యాయులకు ఆదాయపు పన్ను భారం తగ్గించాలని కోరారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయిన సందర్భంగా పలు కీలక విద్యా చట్టాల సవరణ పై చర్చించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న వివక్షను తొలగించి, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ఓటు హక్కు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతుల కోసం ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 23 కు సవరణ చేయాలని కోరారు. ఎంఈడీ కోర్సును దూర విద్యా విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, అదనపు కార్యదర్శి వీరమల్ల వెంకట రమణ రావు, మీడియా ప్రతినిధులు చిట్టిమల్లి శివకుమార్, కొమిరెల్లి భాస్కర్ రెడ్డి తదితరులు విజ్ఞప్తి చేశారు.

Next Story