అమిత్ షా, కేసీఆర్ మధ్య ఒప్పందం.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

by Dishafeatures2 |
అమిత్ షా, కేసీఆర్ మధ్య ఒప్పందం.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమిత్ షా, కేసీఆర్ మధ్య ఢిల్లీలో కీలకమైన ఒప్పందం జరిగినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాలపై ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని లక్ష్యంతో వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేందుకు కృషి చేయాలని అమిత్ షా కేసీఆర్ కు సూచించినట్లు తమకు సమాచారం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇక సీనియర్ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ నుంచి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు 25 కోట్ల ముడుపులు వచ్చినట్లు ఈటల అవాస్తవాన్ని ప్రచారo చేస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని, అవినీతి దోపిడీలపై క్రమం తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉందని మహేష్ కుమార్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఇంటికి పంపించే ప్రక్రియలో కాంగ్రెస్ ఉన్నదని, ఇది తమతోనే సాధ్యమైతుందని ఆయన నొక్కి చెప్పారు. బీజేపీ టిఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలకు పాల్పడినా తమ లక్ష్యాన్ని నీరు కార్చబోమని మరోసారి వెల్లడించారు. పేద ప్రజల గుండెల్లో కాంగ్రెస్ ఉన్నదని తమ పార్టీని బద్నాం చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గడీల పాలనకు గండి కొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.

Next Story

Most Viewed