TPCC Chief : బీఆర్ఎస్ బండారం బయటపడిందనే ఇందంతా.. బీఆర్ఎస్‍పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-09-30 09:13:33  IST  )

మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్‌కే సాధ్యమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

TPCC Chief : బీఆర్ఎస్ బండారం బయటపడిందనే ఇందంతా.. బీఆర్ఎస్‍పై  మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్‌కే (Congress) సాధ్యమని బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. బీసీ రిజర్వేషనులు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, బీఆర్‍ఎస్ ఒకటేనని ఈ రెండు పార్టీలు కలిసే సంసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్‍ఎస్ ఒక్కటై కుట్ర పూరితంగా కాంగ్రెస్‍పై విష ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ- కార్‌ రేస్‌ తో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్ ల బండారం ఒక్కొక్కటి బయట పడుతుండడంతో దిక్కుతోచక ‘బాకీ కార్డు’ పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్‍ఎస్ చేసిన బాకీకి మేము వడ్డీలు కడుతున్నామని బకాయిల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి కేసిఆర్ అవుతారన్నారు. బీఆర్‌ఎస్‌ ‘బాకీ కార్డు’ ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని దీన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రచారం హాస్యాస్పదం:

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పల కుప్పల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ కు బాకీ అనే పదం కూడా ఎత్తే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్ట? రైతు భరోసా ఇస్తే బాకీ పడ్డట్టా? రూ.500 సబ్సిడీతో గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచడం బకాయి పడ్డట్టా? అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వరికి బోనస్‌ ఇవ్వడం బకాయి పడ్డట్టా? రేషన్‌ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం బకాయి పడ్టట్టా? అని నిలదీశారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బకాయి పడడమా? బీఆర్‌ఎస్‌ ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మోడీని అడిగే దమ్ముందా?

పదేళ్ల బిఆర్ఎస్ పాలన నవాబు పాలన అని తెలంగాణను సర్వ నాశనం చేసింది బీఆర్ఎస్ అని విమర్శించారు. ఎరువుల పేరిట కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తోందని, జీఎస్టీ పేరుతో వేల కోట్లు కేంద్రంలోని బీజేపీ దోచుకుందన్నారు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని స్థానిక సంస్థలో ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోడీని అడిగే దమ్ము ఈటల, బండి సంజయ్, అరవింద్ కు లేదా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కు సూటీ ప్రశ్నగా ప్రశ్నిస్తున్నా బీసీ బిల్లులు గురించి మాట్లాడరా అని నిలదీశారు. బీసీల నోటి కాడా ముద్ద లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని దేశంలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే నిర్వహించామన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి అర్హత బీజేపీ నేతలకు లేదని పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ నేతలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు. హైడ్రా రావాల్సిన అవసరం పై అనేక సార్లు ప్రస్తావించానని హైడ్రాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. హైడ్రా రూపకల్పన దూర దృష్టితో తీసుకున్న నిర్ణయం అని ఆదిత్య కన్స్ట్రక్షన్ (Aditya Construction) నిర్మాణం‍పై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

Next Story