RTI చట్టానికి బీజేపీ తూట్లు పొడుస్తోంది.. విజిల్ బ్లోవర్లకు రక్షణ కల్పించాలి.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

సమాచార హక్కు చట్టం(RTI)ని బలహీనపరిచే సెక్షన్ 44(3) సవరణలను పునఃపరిశీలించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RTI చట్టానికి బీజేపీ తూట్లు పొడుస్తోంది.. విజిల్ బ్లోవర్లకు రక్షణ కల్పించాలి.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: డీపీడీపీ చట్టంలోని సమాచార హక్కు చట్టం(RTI)ని బలహీనపరిచే సెక్షన్ 44(3) సవరణలను పునఃపరిశీలించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC chief Mahesh Kumar Goud) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. RTI అమలుకు 20 ఏళ్లు పూర్తి కావడం సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన చారిత్రాత్మక చట్టాల ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. ‘డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారి దూరదృష్టి నాయకత్వంలో RTI, MGNREGA, అటవీ హక్కుల చట్టం, విద్య హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం వంటి ప్రజా ప్రయోజన చట్టాలను అమలు చేసింది. ఇవి దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలిచాయి’ అని అన్నారు. RTI చట్టం పేద, అణగారిన వర్గాలకు జీవనరేఖగా మారి, సరుకుల పంపిణీ, పెన్షన్‌లు, బకాయిలు, స్కాలర్‌షిప్‌లు వంటి హక్కులను సాధించుకునే శక్తిని ప్రజలకు ఇచ్చిందని చెప్పారు.

అయితే, 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం RTI కి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. 2019లో చేసిన సవరణల ద్వారా సమాచారం కమిషన్ల స్వతంత్రతను తొలగించి, పదవీకాలం, సేవా షరతులను కేంద్రం ఆధీనంలోకి తీసుకువచ్చారని తెలిపారు. అదేవిధంగా 2023లో తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ద్వారా ప్రజా ప్రయోజన సమాచారాన్ని కూడా మినహాయింపుగా మార్చి, పారదర్శకతను దెబ్బతీశారని అన్నారు. స్వయం ప్రతిపత్తితో నిర్వహించే RTI కమిషనర్లు కేంద్రం ఒత్తిడిలకు తల్లోగే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర సమాచారం కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం 2 కమిషనర్లతోనే పనిచేస్తోందని తెలిపారు. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంటుంది. ఇంతకంటే దుర్మార్గం లేదు.. అని మండిపడ్డారు.

భోపాల్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త షెహ్లా మసూద్ అక్రమ మైనింగ్ బహిర్గతం చేస్తూ ఉండగా ఇంటి వద్దే కాల్చి చంపబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు RTI యాక్టివిస్టుల్లో భయాన్ని పెంచాయన్నారు. విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ చట్టం.. ఈ చట్టం యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదించినప్పటికీ 2014 నుంచి ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. కేంద్ర & రాష్ట్ర కమిషన్లలో ఖాళీలను తక్షణమే పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. RTI వినియోగదారులు, విజిల్ బ్లోవర్లకు బలమైన రక్షణ కల్పించాలన్నారు. కమిషన్లలో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు వంటి విభిన్న వర్గాల ప్రతినిధులను అవకాశం కల్పించాలన్నారు. చట్టాలను కాపాడుకోవడానికి పౌరులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Next Story