మనుస్మృతి అమలు చేయాలని బీజేపీ పన్నాగం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by Ramesh Naini |

మనుస్మృతి అమలు చేయాలని బీజేపీ పన్నాగం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కి గాంధీ పేరు పలికితే ఉలుకు అని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇవాళ MG రోడ్‌లో ఏఐసీసీ పిలుపు మేరకు pcc ఆధ్వర్యంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగించారు. గాంధీ కుటుంబం పేరు పలికితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని విమర్శలు గుప్పించారు. గాడ్సే పూజించే వారు కాబట్టే గాంధీ పేరు తొలగిస్తున్నారని అన్నారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోడీ, అమిత్ షా కి లేదని అన్నారు. గాంధీ పేరు పలికితే ప్రజల హృదయాల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనపడతారన్నారు. దేశ ప్రజల గుండెల్లో గాంధీ పేరు చిరస్మరణీయమని అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడి జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారన్నారు. ప్రజలకి 100 రోజుల ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకం తెచ్చారని, 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెడుతూ వస్తోందని తెలిపారు.

జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపు అప్రజాస్వామికం అని అన్నారు. మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల్లో నుంచి చెరపలేరన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ గాంధీ పేరు తొలగించడం విచారకరం అని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేసిన వెడమ బొజ్జ ఎమ్మెల్యే అయ్యారన్నారు. సోనియా గాంధీ కుటుంబంపై కక్ష పూరితంగా కేసులు పెట్టారని, గాంధీ, నెహ్రూ లెగసిని మరిపించే ప్రయత్నం చేస్తున్నారని, లౌకిక వాద దేశంలో మోదీ,అమిత్ షా పప్పులు ఉడకవన్నారు.

కులాలు మతం పేరిట రాజకీయం చేసే వారికి గుణపాఠం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యే వెడమ బొజ్జ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story