90% పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా

by Ramesh Naini |

మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

90% పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళుతూ..పక్కా ప్రణాళికలతో మున్సిపల్ ఎన్నికల రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి సిస్టర్ స్ట్రోక్… ఆయన బావ హరీశ్ రావుకి మరదలు స్ట్రోక్ తగిలి మతిభ్రమించిందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. దమ్ముంటే కవిత ప్రశ్నలకు అన్న కేటీఆర్, బావ హరీశ్ రావులు సమాధానాలు ఇవ్వాలని, అవినీతి, పార్టీ పేరు మార్పుపై కవిత అడిగిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు లేవని ఆయన ధ్వజమెత్తారు. కవిత ఆరోపణలకు బాధ్యత వహించి కేటీఆర్, హరీశ్ రావులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు సిద్ధమా?

నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు సిద్ధమా? అని మహేశ్​ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. హైదరాబాద్ భూములు అమ్మిన ఘనత బీఆర్ఎస్ పార్టీ, అసలు రియల్టర్ కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం పైగా స్థానాలను గెలుచుకున్నాం..జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 25 వేలకు పైగా మెజారిటీతో గెలిచాం..ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ మూలంగానే మా మద్దతు దారులు కోల్పోవాల్సి వచ్చిందని, తద్వారా బీఆర్ఎస్, బీజేపీ మద్దతు దారులు లబ్ధి పొందారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

బీజేపీ నేతలు జిల్లా పేరు మార్పు సంగతి పక్కన పెట్టి, మీరు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలని, దేవుడు పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా వార్త కథనాలు బాధాకరమని వాటిని ఖండిస్తున్నానని, వాస్తవానికి దూరంగా వార్త కథనాలు శ్రేయస్కరం కాదని మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు. సినిమా టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహేశ్​ కుమార్ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story