- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు సెంట్రల్ కమిటీకి కోలుకోలేని దెబ్బ.. మీడియా ముందుకు కీలకనేత?
మావోయిస్ట్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. కీలక నేత లొంగుబాటుపై నేడు డీజీపీ నరహరి

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ (సెంట్రల్ కమిటీ) సభ్యుడు నరహరి, ఆయన భార్య తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండగా.. వారిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారన్నది వాస్తవమేనని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన నరహరి, జార్ఖండ్‌కు చెందిన ఆయన భార్య లొంగుబాటుకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఇద్దరూ డీజీపీ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం రావడంతో మావోయిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించనున్నారు.
కేంద్ర కమిటీలో మిగిలింది ఇద్దరే?
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అత్యున్నత నిర్ణయాత్మక వేదికగా భావించే కేంద్ర కమిటీ గత కొన్నేళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భద్రతా బలగాల ఆపరేషన్లు, వరుస ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లతో కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటికే పలువురు కీలక నాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించగా, మరికొందరు లొంగుబాటు బాట పట్టారు. నరహరి లొంగుబాటుతో ప్రస్తుతం కేంద్ర కమిటీలో క్రియాశీలకంగా ఉన్న నేతల్లో మిసిర్ బెస్రా, గణపతి మాత్రమే ప్రధానంగా మిగిలినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
గణపతి పరిస్థితిపై ఇంకా స్పష్టత లేదు
మావోయిస్టు ఉద్యమాన్ని దశాబ్దాల పాటు నడిపించిన అత్యంత కీలక నేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు పరిస్థితిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన లొంగిపోయేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గతంలో పలుమార్లు వెలువడినా అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఉద్యమ కార్యకలాపాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించే పరిస్థితిలో లేరని సమాచారం. అందువల్ల భద్రతా సంస్థలు ఆయనను క్రియాశీల నాయకత్వంలో భాగంగా పరిగణించడం లేదని తెలుస్తోంది.
అంతర్ధానం దిశగా కేంద్ర కమిటీ?
ఒకప్పుడు దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసిన కేంద్ర కమిటీ ప్రస్తుతం దాదాపు అంతర్ధానం దిశగా పయనిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రశ్రేణి నాయకత్వం క్రమంగా తగ్గిపోవడం, కొత్త నాయకత్వం ఎదగకపోవడం, భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో సంస్థాగతంగా మావోయిస్టు పార్టీ బలహీనపడుతున్నట్లు భావిస్తున్నారు. నరహరి దంపతుల లొంగుబాటు అధికారికంగా ధృవీకరణ పొందితే, అది మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.






