- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతి తెలివి ఎక్కువ.. పని తక్కువ: బీఆర్ఎస్ పాలనపై మంత్రి ఉత్తమ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నదీ జలాల నిబంధనలకు విరుద్ధమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నదీ జలాల నిబంధనలకు విరుద్ధమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. పోలవరం-నల్లమల సాగర్ (Polavaram-Nallamala Sagar) ప్రాజెక్టును అన్ని వేదికలపై తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (GRMB)కి లేఖ రాశామని, తమ అభ్యంతరాలను బోర్డు కూడా సమర్ధించిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును కేవలం తెలంగాణే కాదు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో గట్టిగా వాదనలు వినిపించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని అన్నారు. కోర్టు సూచన మేరకు దీనిని సూట్ పిటిషన్‌గా దాఖలు చేస్తున్నామని, వచ్చే సోమవారం జరిగే విచారణకు తాను స్వయంగా హాజరవుతానని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై వెంటనే స్టే ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వైఫల్యాలపై ధ్వజం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి (Palamuru-Rangareddy) ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం చారిత్రక తప్పిదమని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ద్వారా ప్రాజెక్టు వ్యయం పెరగడమే తప్ప ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పాలన అతి తెలివి ఎక్కువ.. పని తక్కువ అన్న చందగా నడిచిందని కామెంట్ చేశారు. వారి నిర్ణయాల వల్ల కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. ఇక హరీష్ రావు (Harish Rao) చూపిస్తున్న లేఖలు ప్రస్తుత పరిస్థితులకు సంబంధించినవి కావని మంత్రి కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గట్టిగా ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపివేసిందని ఆయన స్పష్టం చేశారు. గతంలో పనులు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం ఒకటి రెండు రోజుల్లో మరోసారి న్యాయవాదులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.






