సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌ యంగ్ హీరో ప్రశంసలు

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌ యంగ్ హీరో ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. తాజాగా విద్యావ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల జిల్లా పరిధిలోని గంభీరావ్‌పేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 'మన ఊరు-మన బడి' కార్యక్రమం కింద దీనిని నెలకొల్పింది. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే, ఈ వీడియోను టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా 'విద్య యొక్క గొప్ప లక్ష్యం జ్ఞానం కాదు, యాక్షన్ అని ఎక్కడో చదివాను. మన ఊరు-మన బడి వంటి గొప్ప కార్యక్రమం ద్వారా తీసుకున్న చొరవ నన్ను నమ్మేలా చేస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు నా అభినందనలు' అంటూ శర్వానంద్ పేర్కొన్నాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ శర్వానంద్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఎక్కువగా తన సినిమా ప్రమోషన్స్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే శర్వానంద్.. కేసీఆర్, కేటీఆర్‌లపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తోన్నారు.

శర్వానంద్‌పై నెటిజన్లు ఫైర్..

ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసే ముందు గ్రౌండ్ వర్క్ చేయాలని, స్కూళ్లల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి వచ్చి చూడాలని కొంతమంది నెటిజన్లు శర్వానంద్‌కు సూచిస్తున్నారు. కొన్ని స్కూళ్లల్లో మాత్రమే అన్ని వసతులు ఉన్నాయని, చాలా స్కూళ్లల్లో టాయిలెట్ సౌకర్యం, బెంచ్‌లు కూడా లేవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయో, డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం ఎంతమంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారో శర్వానంద్‌కు తెలియదా? అని మరికొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణలో విద్యారంగ బడ్జెట్‌ను 20 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వసతులు సరిగ్గా లేని స్కూళ్లను దత్తత తీసుకోవచ్చుగా అంటూ కొంతమంది శర్వానంద్‌కు సలహా ఇస్తున్నారు. స్కూళ్లల్లో పరిస్థితి మరోలా ఉందని, ఇదంతా పెయిడ్ ప్రమోషన్ అంటూ కొంతమంది వరుస కామెంట్లతో శర్వానంద్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారే తెలుస్తుంది. ఇంకొందరు మాత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి శర్వానంద్ పెట్టిన ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed