నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తు పౌరులు : మంత్రి సీతక్క

by Muthe.Rajitha |

నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులని, సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించిన తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్య సాధనలో వారి పాత్రే అత్యంత కీలకమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.

నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తు పౌరులు : మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులని, సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించిన తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్య సాధనలో వారి పాత్రే అత్యంత కీలకమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో బాలల హక్కుల కమిషన్ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు, కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ సృజనతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బాలల హక్కుల కమిషన్ ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన వనరులపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లాస్థాయిలో మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి మరింత సహకారం అందించాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యం అందించేందుకు మిషన్ వాత్సల్య ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల వారీగా సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించి తగినన్ని దరఖాస్తులు రాకపోవడంతో దరఖాస్తు గడువు పొడిగింపుపై న్యాయ సలహా తీసుకొని నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. బాలల హక్కుల కమిషన్ క్షేత్రస్థాయిలో మరింత క్రియాశీలకంగా పనిచేసేందుకు తమ శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్ మరింత కీలక పాత్ర పోషించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.

Next Story